
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాదిరిగానే హైకోర్టులు కూడా రాజ్యాంగ న్యాయస్థానాలేనని, ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే తేడా లేదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అదేవిధంగా, ఫలానా వ్యక్తినే న్యాయమూర్తిగా సిఫారసు చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టులకు ఆదేశాలు ఇవ్వ జాలదని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయవాదులను హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించే అంశాన్ని పరిశీలించాలంటూ అంతకుముందు బార్ అధ్యక్షుడు వికాస్ సింగ్ చేసిన వినతిపై ఆయనీ మేరకు స్పందించారు. ‘జడ్జీల నియామకంపై సిఫారసులు చేయాల్సింది ముందుగా హైకోర్టులే. హైకోర్టులు అందజేసిన పేర్లలో కొన్నిటిని మాత్రం మేం సిఫారసు చేస్తాం. తిరిగి మాకు అందిన జాబితాలోని వారు మాత్రమే జడ్జీలుగా నియమితులవుతారు’అని ఆయన తెలిపారు.