
దత్తతకు సిద్ధంగా ఉన్న 2,777 మంది పిల్లలు
వారికోసం 36,433 మంది పేరెంట్స్ పడిగాపులు
తల్లిదండ్రులు మూడున్నరేళ్లు నిరీక్షించాల్సిన పరిస్థితి
‘దత్తత ప్రక్రియలో దీర్ఘ జాప్యం కారణంగా దత్తత తీసుకోవడానికి చట్టబద్ధంగా అర్హులని ప్రకటించిన పిల్లలకు డిమాండ్ పెరిగింది, దీనివల్ల దత్తత కోసం పిల్లలను అక్రమంగా తరలించే ప్రమాదం ఉంది’– ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి.
దేశంలో దత్తతకు చట్టపరంగా ఏ అడ్డంకులూ లేని బిడ్డ కోసం దంపతులు.. సగటున మూడేళ్లకుపైగా వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇలా ఆలస్యమయ్యేకొద్దీ కొన్నాళ్లకు వాళ్లకు దత్తతపై పూర్తిగా ఆసక్తిపోయే అవకాశం ఉంటుంది. ఇది అనాథలైన చిన్నారుల పాలిట శాపంలా మారుతుంది. వా రికొక కుటుంబం ఏర్పడే అవకాశాన్ని కాలరాస్తోంది.
చిన్నారుల దత్తత ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే ‘కేరింగ్స్’పోర్టల్ ద్వారా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దత్తత విధి విధానాలు శీఘ్రంగా అమలయ్యేందుకు కేంద్ర దత్తత వ్యవహారాల ప్రాధికార సంస్థ (కారా)ను ఏర్పాటుచేసింది. ఇది గత కొన్నేళ్లుగా దత్తతలను సమర్థంగా నిర్వహించలేకపోతోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పరిమిత సంఖ్యలో మాత్రమే పిల్లలను దత్తత ఇవ్వటానికి చట్టబద్ధమైన అనుమతులు పొందగలుగుతోంది. దీనిపై గతంలోనే పార్లమెంటరీ కమిటీ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
దరఖాస్తుల వెల్లువ
సమాచార హక్కు దరఖాస్తుల ద్వారా వెల్లడైన తాజా సమాచారం ప్రకారం 2021లో 26,734 మంది తల్లిదండ్రులు దత్తత కోసం ‘కారా’పోర్టల్‌లో నమోదు చేసుకోగా, 2,430 మంది పిల్లలు మాత్రమే చట్టబద్ధమైన దత్తతకు సిద్ధంగా ఉన్నారు. అంటే, ప్రతి బిడ్డకు 11 మంది తల్లిదండ్రులు ఎదురు చూశారన్నమాట. 2025 జూలై 19 నాటికి, దత్తత తీసుకునేందుకు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల సంఖ్య 36,433కి, పిల్లల సంఖ్య 2,777కి పెరిగింది. ప్రస్తుతం దత్తతకు యోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డకు 13 మంది తల్లిదండ్రులు ఉన్నారు. 2025–26లో జూలై 19 వరకు 1,365 మంది పిల్లలు దత్తుకు వెళ్లారు.
మూడేళ్లకు పెరిగిన జాప్యం
2025లో దేశం మొత్తం మీద దత్తత కోసం పేర్లు నమోదు చేసుకున్న తల్లిదండ్రుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నారు. దత్తతకు న్యాయపరమైన అన్ని ప్రక్రియలు పూర్తవటానికి 2017లో ఒక సంవత్సరంగా ఉన్న సగటు ఆలస్యం 2022 నాటికి మూడేళ్లకు, ప్రస్తుతం దాదాపు 3.5 సంవత్సరాలకు పెరిగింది.
34 శాతం వారే!
ప్రస్తుతం దత్తత కోసం సిద్ధంగా ఉన్న పిల్లల్లో దాదాపు 34 శాతం మంది 14–18 సంవత్సరాల వయసువారే. ‘దత్తత తీసుకుంటున్న తీరును పరిశీలిస్తే.. భారతీయ తల్లిదండ్రులు సాధారణంగా పెద్ద పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను దత్తత తీసుకోవడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది’అని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది.
అర్హత ప్రక్రియల్లో అస్పష్టత
జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) చట్టం (2021) ప్రకారం బాలల సంరక్షణ సంస్థలలో (సీసీఐలు) ఉండే పిల్లలను దత్తతకు అనుమతిస్తారు. కానీ, ఆయా రాష్ట్రాల్లో సీసీఐలలో ఉండే పిల్ల ల సంఖ్యకు, దత్తతకు అర్హులుగా ప్రకటించే పిల్లల సంఖ్యకూ చాలా వ్యత్యాసం ఉంటోంది. పిల్లల సంఖ్య ఎక్కు వ ఉన్నప్పటికీ.. దత్తతకు అర్హులైన వారి సంఖ్య తక్కు వగా ఉంటోంది. 2025లో 22,000 కంటే ఎక్కువ మంది పిల్లలు సీసీఐలలో ఉన్నారని, చట్టబద్ధంగా దత్తతకు అర్హత ఉన్న పిల్లల సంఖ్య కంటే ఇది 8.5 రెట్లు ఎక్కువ అనీ సమాచార హక్కు డేటా చూపిస్తోంది.
సీసీఐలలోని పిల్లల్లో అనాథలు, తల్లిదండ్రులు వదిలేసినవారు, బంధువులు తెచ్చి అప్పగించినవారు, సంరక్షకులు లేని పిల్లలు ఉంటారు. వారిలో దత్తతకు అర్హమైన పిల్లల్ని ప్రక టించే ప్రక్రియ ఇంకా అస్పష్టంగానే ఉంది. సంరక్షకులు / తల్లిదండ్రులు ఉండి కూడా ఏనాడూ తమ పిల్లల ముఖం చూడ్డానికి రాకపోవటం వల్ల కూడా చట్టబద్ధంగా వారిని దత్తత ఇవ్వటంలో అవాంతరాలు ఎదురౌతున్నాయి.