
ఒకేసారి 26.17 లక్షల ప్రమిదలు వెలిగించిన అయోధ్యవాసులు
ఒకేసారి హారతి పట్టిన 2,128 మంది భక్తులు
అయోధ్య: దీపావళి వేళ భారతదేశమంతటా టపాసుల మోత మోగుతుంటే ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఒక్కసారిగా గిన్నిస్ రికార్డుల మోత మోగించింది. ఇందుకు సరయూ నదీతీర ఘాట్‌లు వేదికగా నిలిచాయి. దీపావళి సందర్భంగా ప్రతిఏటా నిర్వహించే దీపోత్సవంలో భాగంగా ఈ సారి మరిన్ని ఎక్కువ ప్రమిదలను వెలిగించి కొత్త గిన్నిస్ ప్రపంచరికార్డ్‌ను అయోధ్యవాసులు సృష్టించారు. ఒకేసారి 26,17,215 దీపపు ప్రమిదలను ఆదివారం రాత్రి సరయూ నదీ ఘాట్‌ల వెంట వెలిగించారు. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్‌ను ధ్రువీకరించారు.
2,128 మంది ఒకేసారి హారతి పట్టి మరో గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పారు. యూపీ పర్యాటక శాఖ, అయోధ్య పాలనా యంత్రాంగం, రామ్‌మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం సమష్టిగా ఒకేసారి 26 లక్షలకుపైగా దీపం ప్రమిదలను వెలిగించి ఈ కొత్త రికార్డ్‌ను సృష్టించారు. హారతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, సరయూ హారతి సమితులు సంయుక్తంగా చేపట్టాయి. సరయూ వెంట 56 ఘాట్‌లలో దీపాలు వెలిగించారు. ముఖ్యంగా 10వ నంబర్ ఘాట్‌లో 80,000 ప్రమిదలతో చేసిన స్వస్తిక్ గుర్తు డ్రోన్ నుంచి చూస్తే ఎంతగానో ఆకట్టుకుంటోంది.
అయోధ్యకు పోటెత్తిన అశేష భక్తజనం
ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌కాలంలో ఏకంగా 23.82 కోట్ల మంది భక్తులు అయోధ్య నగరం, అయోధ్య భవ్య రామమందిరాన్ని దర్శించుకున్నారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. దీపోత్సవం సందర్భంగా ఇటీవల దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.