అయోధ్య: శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్య నేడు (ఆదివారం) జరిగే ‘దీపోత్సవ్’కు ముస్తాబయ్యింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ వేడుక ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘దీపోత్సవం-2025’కు అందరినీ ఆహ్వానించింది.
2017లో ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొమ్మిదవ దీపోత్సవానికి విస్తృత సన్నాహాలు చేశారు. ధరంపత్ నుండి లతా చౌక్, రామ్‌కథా పార్క్, సరయు ఘాట్ వరకు అంతటా వెలుగులు విరజిమ్మనున్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. 26 లక్షల11 వేల 101 దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు.
దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే రెండు లక్షలకు పైగా దీపాలను వెలిగించారని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఘాట్ల వారీగా దీపాల సంఖ్యను లెక్కిస్తోందన్నారు. ఘాట్ నంబర్ 10 వద్ద, విశ్వవిద్యాలయ వాలంటీర్లు 80 వేల దీపాలతో స్వస్తిక్ చిహ్నాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా ఐడి కార్డు లేకుండా ఘాట్లలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 8:30 గంటలకు రామ్ కీ పైడిలో లేజర్ షో, లైట్ అండ్ సౌండ్ షో, డ్రోన్ షో నిర్వహించనున్నారని మీడియాకు అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ తెలిపారు.


