ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జులారియాలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బాలుడు 75 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9(గురువారం) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు చెందిన గొర్రెల కాపరుల కుటుంబం తమ మందలతో కలిసి ఇక్కడికి వచ్చింది. వారి రెండేళ్ల కుమారుడు భగీరథ్ ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు.
ఎస్పీ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బోరుబావిపై రక్షణగా ఒక రాయిని ఉంచారు. అయితే.. ఒక గొర్రె ఆ రాయిని పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత బాలుడు.. ఆ మూతను తెరిచి లోపలికి తొంగి చూస్తుండగా ప్రమాదవశాత్తూ లోపలికి జారి పడిపోయాడు. బద్నావర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్ పాటిదార్ నేతృత్వంలో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. ఉజ్జయిని కలెక్టర్ రోషన్ సింగ్, ఎస్పీ ప్రదీప్ శర్మ స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఉజ్జయినిలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4న ఉజ్జయినిలో తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా.. గునా బైపాస్ రోడ్డు వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టి 40 అడుగుల లోతైన గుంతలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. ఒక చిన్నారితో సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో.. ఉజ్జయినిలోని ధాబా రోడ్డులో ఉన్న గేబీ హనుమాన్ ఆలయం సమీపంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్ ఠాగూర్ ధృవీకరించారు.


