ఖాట్మండ్: నేపాల్‌లోని రోల్పా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఒక కొండ ప్రాంత రహదారిపై జీపు అదుపుతప్పి సుమారు 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు.
పోలీసుల వివరాల ప్రకారం, థావాంగ్ గ్రామీణ పురపాలక సంఘంలోని జల్జల ప్రాంతంలో వర్షం కురుస్తుండగా బురదమయమైన రహదారిపై వాహనం జారి కొండ కిందికి పడిపోయింది. జల్జలలో శుక్రవారం జరగనున్న బైశాఖ పౌర్ణమి ఉత్సవానికి హాజరయ్యేందుకు స్థానికులు ఈ ప్రైవేట్ జీపును అద్దెకు తీసుకున్నారని రోల్పా జిల్లా పోలీస్ కార్యాలయ సమాచార అధికారి, ఇన్‌స్పెక్టర్ సునీల్ థాపా నేపాలి తెలిపారు.
ఆ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.


