జార్ఖండ్ రాష్ట్రంలోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలోని చక్రధర్‌పూర్‌లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక మానవ అక్రమ రవాణా వలలో చిక్కుకొని, ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.25,000కు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. జనవరి 20న ఆ బాలిక తన పెద్ద అక్కతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత బాలిక కోపంతో మధ్యలోనే విడిపోయి.. చక్రధర్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఒంటరిగా ఉన్న ఆమెను ఒక గుర్తు తెలియని వ్యక్తి మాయమాటలతో వలలోకి లాగాడు. అతను ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని, మంచి జీవితం ఇస్తానని చెప్పి నమ్మించాడు.
ఆ తర్వాత ఆ వ్యక్తి ఆమెను రైలులో ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సీతాపూర్ జిల్లా ఇనాయత్పూర్‌కు తీసుకెళ్లి, కిషోరీ లాల్ కుయిరి అనే వ్యక్తిని సంప్రదించాడు. తరువాత ఆ బాలికను అమ్మే విషయాన్ని మరో వ్యక్తి సందీప్ కుమార్‌కు తెలియజేశాడు. చివరికి సందీప్ కుమార్ తన భూమిని తాకట్టు పెట్టి రూ.25,000 చెల్లించి ఆ బాలికను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లి, అక్క చాలా రోజుల పాటు వెతికారు. చివరికి ఏప్రిల్ 2న పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. టెక్నికల్ సర్వైలెన్స్, సమాచారం ఆధారంగా.. పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని స్థలాన్ని గుర్తించి దాడి చేసి బాలికను రక్షించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
రక్షణ అనంతరం బాలిక తన వాంగ్మూలంలో.. తనపై నిరంతర శారీరక హింస జరిగిందని తెలిపింది. శరీరంపై కాలిన గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది వైద్య పరీక్షల నివేదిక తర్వాత తెలుస్తుందని చెప్పారు.


