ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం | 12 Rescued As 5 Storey Building Collapses In South Delhi, NDRF Conducts Major Rescue Operation | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కూప్పకూలిన ఐదు అంతస్తుల భవనం

May 31 2026 8:24 AM | Updated on May 31 2026 1:01 PM

12 Rescued As 5 Storey Building Collapses In South Delhi

ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఐదు అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా రక్షించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారనే అనుమానంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

సాయిదుల్లాజాబ్ ప్రాంతంలోని వెస్ట్రన్ మార్గ్‌లో ఉన్న ఈ ఐదు అంతస్తుల భవనంలో కోచింగ్ సెంటర్, కేఫ్‌లు, కార్పొరేట్ కార్యాలయాలు నడుస్తున్నాయి. మూడో అంతస్తులో కొంత నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. శనివారం రాత్రి 7:45 నిమిషాల సమయంలో ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పక్కనే విద్యార్థులు రాత్రి భోజనం చేస్తున్న ఒక తాత్కాలిక రేకుల షెడ్డు (క్యాంటీన్)పై ఈ భవనం పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

డీఎఫ్‌ఎస్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, డీడీఎంఏ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించడానికి జేసీబీ ఎక్స్‌కవేటర్లు, హైడ్రాలిక్ కట్టర్లతో పాటు.. లోపల చిక్కుకున్న వారిని గుర్తించడానికి ప్రత్యేక విక్టిమ్-లొకేషన్ కెమెరాలు, ఎర్త్-అగర్ డ్రిల్లింగ్ మిషన్లు మరియు శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు) రంగంలోకి దించారు.

స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో క్యాంటీన్, భవనంలో కలిపి దాదాపు 100 నుండి 150 మంది వరకు ఉండవచ్చని... శిథిలాల కింద నుంచి రక్షించాలంటూ ఆర్తనాదాలు విన్నామంటూ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతానికి 12 మందిని రక్షించాం. శిథిలాల కింద ఎవరూ లేరని భావిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో రెస్క్యూ పూర్తయ్యే వరకు కచ్చితంగా చెప్పలేం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement