● పీహెచ్‌సీల పనితీరుకు ర్యాంకింగ్
● వెనుకబడిన కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
నారాయణపేట: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ సేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు వైద్య సేవలతో పాటు ఆరోగ్య కార్యక్రమాల అమలులోనూ నాణ్య త, ఫలితాలు పెరగాలన్నారు. పీహెచ్‌సీల పనితీరును వివిధ సూచికల ఆధారంగా పాయింట్ల వారీగా విశ్లేషించి ర్యాంకింగ్ ఇవ్వాలని సూచించారు. తద్వారా మెరుగ్గా పనిచేస్తున్న కేంద్రాలను గుర్తించడంతో పాటు వెనుకబడిన పీహెచ్‌సీలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు, సిబ్బంది హాజరు, సేవల నాణ్యత, ఆరోగ్య కార్యక్రమాల అమలును పర్యవేక్షించాలని కోరారు. ఆరోగ్య మహిళ, ఇతర నివారణాత్మక కార్యక్రమాలను విస్తతం చేయాలన్నారు. మద్దూరులో ప్రత్యేక ప్రణాళికతో మహిళలందరికీ స్క్రీనింగ్ నిర్వహించి గ్రామాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇమ్యూనైజేషన్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో శతశాతం పురోగతి సాధించాలని సూచించారు. ఎన్‌సీడీ, డయాబెటిస్, బీపీ, క్యాన్సర్ స్క్రీనింగ్, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవాలని, డెంగీ, మలేరియా, చికునన్‌గున్యా నియంత్రణకు ఫ్రై డే– డ్రై డే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే సమీక్షకు పూర్తి గణాంకాలతో హాజరుకావాలని స్పష్టం చేశారు. సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సిద్ధప్ప, డీపీఓ భిక్షపతి పాల్గొన్నారు.


