నారాయణపేట: సంక్షేమ పథకాలు అర్హులందరికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పనిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ డీకే అరుణ కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ సమావేశంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొని వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై శాఖల వారీగా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తే తదుపరి అభివృద్ధి పనులకు అనుమతులు, అదనపు నిధులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లా అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
పీఎం సూర్యఘర్‌కు
151 రిజిస్ట్రేషన్లు..
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి జిల్లాలో ఇప్పటి వరకు 151 రిజిస్ట్రేషన్లు అయ్యాయని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నవీన్ వివరించారు. వీటిలో 49 సర్వీసులు విడుదల కాగా.. 162.32 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీఎం కుసుమ్ పథకం కింద 24 ప్రతిపాదనలు సమర్పించగా మూడు ప్రాజెక్టులకు అనుమతి లభించిందని తెలిపారు. సూర్యఘర్ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
అర్హులకే ఇళ్లు..
జిల్లాలో అర్హులందరికి ఇళ్లు మంజూరు చేయాలని ఎంపీ సూచించారు. పీఎంశ్రీ పాఠశాలలకు సంబంధించి మొత్తం 15 పనుల్లో ఏడు పూర్తయ్యాయని, ఎనిమిది పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
అధికారులకు
అభినందనలు..
పీఎండీకేవైలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమని ఎంపీ కొనియాడారు. రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. సాధించిన ఫలితాలను కొనసాగిస్తూ జిల్లాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
భారత్‌మాల పరిహారంపై సమీక్ష..
భారత్‌మాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై ఎంపీ వివరాలు కోరారు. సుమారు 600 ఎకరాల్లో 1,500 మంది రైతులు ఉండగా.. 150 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్డీఓ రమేష్ తెలిపారు. మొత్తం రూ.217 కోట్ల పరిహారానికిగాను రూ.184 కోట్లు చెల్లించినట్లు వివరించారు. పరిహారం రేటు తక్కువగా ఉందన్న కారణంతో కొందరు రైతులు స్వీకరించలేదని తెలిపారు. భూ సేకరణ సమస్యను పరిష్కరించి పనుల్లో వేగం పెంచాలని, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీ సూచించారు.
కాగితాలకే పరిమితం కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి
శాఖల మధ్య సమన్వయంతోనే లక్ష్య సాధన సాధ్యం
దిశ సమావేశంలో
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ


