నారాయణపేట: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డా. వినీత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, సమావేశాలు, బహిరంగ సభలు, జన సమూహాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించినా, నిషేధాజ్ఞలను ఉల్లంఘించినా నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో మతాల మధ్య చిచ్చుపెట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అనవసరమైన సమాచారం ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీసులకు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.
చట్టాలపై
అవగాహన అవసరం
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని.. చట్టం అంటే శిక్ష కాదు, రక్షణ అని జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రాథమిక హక్కులు, విధులు, పోక్సో కేసులు, శిక్షలు, బాలకార్మిక వ్యవస్థ తదితర వాటిపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక వేధింపు జరిగితే పోక్సో చట్టం 2012 కింద 20 ఏళ్ల వరకు జైలుశిక్ష ఉంటుందని, అవసరమైతే ఉరి శిక్ష విధిస్తారన్నారు. గంజాయి, డ్రగ్స్, హెరాయిన్ వినియోగం నేరమని.. దీనికిగాను 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారని వివరించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1098కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలలతో పనులు చేయించడం నేరమని, అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, లైసన్ అధికారి కృష్ణయ్యగౌడ్, ప్రిన్సిపాల్ పద్మ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన కీలకం
నారాయణపేట: పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, దేహ దారుఢ్యం అత్యంత కీలకమని ఆర్‌ఐ విజయ్‌కుమార్ అన్నారు. ఎస్పీ డా. జి.వినీత్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీక్లీ పరేడ్‌తో శారీరక దారుఢ్యం, మాన సిక ప్రశాంతత సమకూరుతాయని పేర్కొ న్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతను గుర్తించి అప్రమత్తంగా, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రోజూ వ్యా యామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐలు శివశంకర్, శిరీషతో పాటు ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మినిస్టర్ కప్ విజేత నర్వ
నర్వ: నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల మినిస్టర్ కప్ విజేతగా నర్వ ఉపాధ్యాయ జట్టు నిలిచింది. శనివారం మక్తల్‌లో నిర్వహించిన చివరి పోరులో ఊట్కూర్ జట్టుతో తలపడి విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. పాఠశాలల్లో నిరంతరం పాఠాలు బోధిస్తూ ఒత్తిడిని ఎదుర్కొనే ఉపాధ్యాయులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు, క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో క్రికెట్ పోటీలు నిర్వహించామని డీవైఎస్‌ఓ వెంకటేష్‌శెట్టి తెలిపారు. పోటీల్లో మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాల ఉపాధ్యాయ జట్లు పాల్గొన్నాయి.


