నేడు ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

నారాయణపేట: జిల్లా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టేందుకు ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు, ఫిర్యాదుదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు తెలియజేయడానికి ఎస్పీ కార్యాలయ ఫోన్‌ నంబర్‌ 0850–6281182 కు కాల్‌ చేయొచ్చని సూచించారు. ఎస్పీ స్వయంగా ప్రజలతో ఫోన్‌ ద్వారా మాట్లాడి వారి సమస్యలను విని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ముఖ్యంగా శాంతిభద్రతలు, భూ వివాదాలు, సైబర్‌ మోసాలు, మహిళల భద్రత, ట్రాఫిక్‌ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకురావాలని సిబ్బంది కోరారు.

‘ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం’

నారాయణపేట: జిల్లా మహిళా సమాఖ్యను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌ సచివాలయం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ఇందిరా గాంధీ సీ్త్ర శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేట జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి వీసీలో సీఎంతో మాట్లాడారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌ బంక్‌ లాభాల్లో కొనసాగుతోందని తెలిపారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహిళలకు లభించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదుగుతామని అరుంధతి తెలిపారు.

‘ప్రణాళికాబద్ధంగా

ధాన్యం సేకరించాలి’

వనపర్తి: అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రణాళికబద్ధంగా కొనుగోలు చేసి రైతులకు ఇబ్బందుల లేకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ సంచాలకులు శ్యాంప్రసాద్‌లాల్‌ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉమ్మడి జిల్లా సివిల్‌ సప్‌లై అధికారులు, డీఎంలు, కోఆపరేటివ్‌ అధికారులు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే ప్రభుత్వానికే ఇబ్బందని, వాటిని సేకరించాల్సిందే అని అధికారులకు సూచించారు. పూర్తిస్థాయిలో వర్షాలు పడకముందే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, అన్‌లోడింగ్‌ పాయింట్ల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లులను వడ్లు నిల్వ చేసుకోడానికి ఉపయోగించుకోవాలన్నారు. సీఎమ్మార్‌ ప్రక్రియను సైతం వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ వినోద్‌ కుమార్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్‌, మహబూబ్‌నగర్‌ సివిల్‌ సప్‌లై అధికారి శ్రీనివాస్‌, డీఎం ఆంజనేయులు, ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారి మానస, కోఆపరేటివ్‌ అధికారి బి.రాణి, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల పౌర సరఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జూన్‌ 1 నుంచి మయూరి పార్క్‌లో ప్లాస్టిక్‌ నిషేధం

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, పార్క్‌ పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని, మయూరి పార్క్‌లో జూన్‌ 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్‌ఓ శివ్‌ ఆశిష్‌ సింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్‌లోకి ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, ఇతర ప్లాస్టిక్‌ పదార్థాలు తీసుకురావడం అనుమతించమని స్పష్టం చేశారు. సందర్శకులు పర్యావరణహిత వస్తువులు మాత్రమే ఉపయోగించాలని కోరారు. వన్యప్రాణులు, పక్షులు, పార్క్‌లోని సహజ వాతావరణాన్ని కాపాడేందుకు ఈ నిర్భయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని, సందర్శకులు, పర్యాటకులు ఈ నియమాలను పాటించి అటవీ శాఖకు సహకరించాలని విన్నవించారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement