ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి..
నారాయణపేట: రైతులు వరి, పత్తి సాగుకే పరిమితం కాకుండా ప్రకృతి వ్యవసాయం, కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్‌పాం తోటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. శనివారం మక్తల్ మండలం జక్లేర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌న్‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో గ్రామభారతి.. సత్య దర్శనం సహకారంతో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తి మాత్రమే కాకుండా భూ సారాన్ని కాపాడటంలో ప్రకృతి వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతులకు అన్నివిధాల సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, బ్లాక్, బ్రౌన్ రైస్ వంటి సేంద్రియ ఉత్పత్తులను ఒకే బ్రాండ్ కింద మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) మార్కెటింగ్ లింక్‌గా పనిచేయాలని సూచించారు. ఆర్గానిక్ ట్యాగ్‌తో ఉత్పత్తులను విక్రయించాలంటే పెద్ద మార్కెట్లతో అనుసంధానం అవసరమని.. ప్రకృతి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఫౌండేషన్ సభ్యులు చేసిన విజ్ఞప్తులకు సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, ఉద్యాన అధికారి సాయిబాబా, ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ నియామక పత్రాలు అందజేత..
మహబూబ్‌నగర్‌లో ఈ నెల 1న నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికై న జిల్లా అభ్యర్థులకు కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోందన్నారు. అర్హత, నైపుణ్యం కలిగిన స్థానిక యువతకు రానున్న రోజుల్లో పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న భావన లేకుండా ఇష్టపడి పనిచేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని యువతకు ప్రేరణనిచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్ శెట్టి, డీపీఆర్వో రషీద్ తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్: పట్టణ శివారులో కొనసాగుతున్న ఉపాధి పనులను శనివారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 5.30కే పనులకు రావాలని, ఎండ తీవ్రత పెరిగేలోగా ఇంటికి చేరాలని సూచించారు. కూలీలకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని ఏపీఓను ఆదేశించారు. గ్రామపంచాయతీ పెద్దదని.. కనీసం 150 మంది కూలీలైనా ఉండాలని సూచించారు. మండలంలోని వల్లంపల్లి, బిజ్వార్, నాగిరెడ్డిపల్లిలో కూలీల సంఖ్య చాలా తక్కువగా ఉందని.. పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. సర్పంచ్ రేణుక కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. ఆమె వెంట ఏపీఓ లక్ష్మారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ రమేష్, రవి, పీఏ శివ తదితరులు ఉన్నారు.


