వేతన వెతలు! | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు!

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

నారాయణపేట రూరల్‌: విద్యా విధానంలో మార్పులొస్తున్నాయి.. కొత్త పద్ధతుల అమలు కొనసాగుతోంది.. కాని పర్యవేక్షణకు నియమించిన సీఆర్పీల అవస్థలు మాత్రం తీరడం లేదు. సమాన పనికి సమాన వేతనం అమలు మాత్రం అందని ద్రాక్షగా మారింది. వ్యవస్థ ప్రారంభమైన సమయంలో నియామక ప్రక్రియ చేపట్టగా.. మధ్యలో మానేసిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో అదనపు భారంతో సతమతమవుతున్నారు. 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామంటూ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేటి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రకటనతో తమకు ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఆశగా ఎదరుచూస్తున్నారు. రెండేల్ల కిందట డిమాండ్ల సాధనకు సీఆర్పీలు హైదరాబాద్‌లో ధర్నా సైతం చేపట్టారు.

నియామకం ఇలా..

ఉపాధ్యాయులు, అధికారులకు మధ్య వారధులుగా ఉంటూ పాఠశాలలు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు, ఎంఈఓలకు అనుసంధానంగా పని చేయడానికి సీఆర్పీలను నియమించారు. ఎనిమిదేళ్లకు కిందట ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాతపరీక్ష నిర్వహించి ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఎమ్మార్పీలను ఎంపిక చేసి వారి ద్వారా ఎమ్మార్సీ కార్యాలయ పనులు, పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు చేయించేవారు. అయితే ఉపాధ్యాయులు పాఠశాలలు వదిలి కార్యాలయానికి రావడంతో విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో పాటు విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లను అత్యవసర పరిస్థితులు, జనాభా లెక్కలు, ఎన్నికల విధులకు మాత్రమే వినియోగించాల్సి ఉండటంతో ఈ వ్యవస్థను రద్దు చేసి తిరిగి పాఠశాలలకు పంపించారు. 2011లో కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులను 2012లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సర్వశిక్ష అభియాన్‌ కింద కాంట్రాక్టు విధానాంలో కార్యాలయ పనులకు ఒక్కో ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లను, మండలంలోని పాఠశాలలను విభజించి క్లస్టర్లుగా మార్చి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో సీఆర్పీని నియమించారు.

సీఆర్పీలు

28

విద్యార్థులు

1.06 లక్షలు

విధుల నిర్వహణ..

సీఆర్పీలు తరుచూ పాఠశాలలకు వెళ్లి అవసరమైన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్‌ హెచ్‌ఎంకు సహకరిస్తూ యూడైస్‌, చైల్డ్‌ ఇన్ఫో పూర్తి చేయాలి. ప్రతి నెలకు సంబంధించిన డైరీ రాస్తూ ఎస్‌టీపీఎస్‌ టీచర్లు లీవ్‌ పెడితే స్కూల్‌కు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధించాలి. ఇక ప్రతి నెల కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించాలి. దీనికితోడు సర్వేలు, బడిబయటి పిల్లల గుర్తింపు, పాఠశాల వివరాలు, అక్కడి సమస్యలతో పాటు మ్యాప్‌ తయారు చేయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం లేని స్కూల్‌ గుర్తించాలి, మధ్యాహ్న భోజనం పరిశీలనతో పాటు క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలలల్లో నిర్వహించే ఎస్‌ఎంసీ సమావేశాలకు హాజరుకావాలి. వారి నుంచి వచ్చిన వినతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతి పాఠశాలను నెలలో రెండుసార్లు సందర్శించి టీచర్ల పనితీరును గుర్తించాలి. ఏటా ఉపాధ్యాయ ఖాళీలు గుర్తించాలి. వివిధ రకాల మేళాలు, పోటీలు నిర్వహించాలి.. కేజీబీవీలను సైతం సందర్శించాలి.

ఉమ్మడి రాష్ట్రంలో సీఆర్పీల వ్యవస్థ ప్రారంభమైంది. అప్పట్లో అరకొర వేతనంతోనే విధులు నిర్వర్తించగా.. క్రమంగా రూ.15 వేలకు చేరింది. మూడేళ్ల కిందట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.19,500కు పెంచింది. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వీరితో పాటు విధుల్లో చేరిన సీఆర్పీలకు రూ.28,500 అక్కడి ప్రభుత్వం చెల్లిస్తుంది. విధులు, బాధ్యతలు సమానంగా ఉన్నా.. వేతనంలో చాలా వ్యత్యాసం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.

జిల్లాలో ఇలా..

మండలాలు

13

పాఠశాలలు

640

క్లస్టర్లు

33

చాలీచాలని జీతాలతో సీఆర్పీల అవస్థలు

భర్తీకాని ఖాళీలు.. అదనపు పనిభారంతో సతమతం

ప్రభుత్వాలు మారినా నెరవేరని హామీ

సమాన పనికి.. సమాన వేతనం

అందని ద్రాక్షేనా?

Advertisement
 
Advertisement
Advertisement