సాగు.. సతమతం | - | Sakshi
Sakshi News home page

సాగు.. సతమతం

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

రైతులకు భారంగా మారుతున్న వ్యవసాయం

పెరుగుతున్న పెట్టుబడులు..

కూలీలు, పొలం దున్నేందుకు వినియోగించే యంత్రాల అద్దెలు, నాలుగేళ్లుగా పెరుగుతున్న కాంప్లెక్స్‌ ఎరువుల ధరలతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. వరి, పత్తికి ఎరువుల వినియోగం అధికంగా ఉండటంతో వాటిని అసరా చేసుకొని కంపెనీలు ధరలను పెంచుతుండటంతో రైతు పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు. కేంద్రం ఎరువుల ధరలను నియంత్రించకపోవడంతో ఆ భారమంతా రైతులపై పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం 2026–27 వానాకాలంలో 14 పంటల కనీస మద్దతు ధరలను పెంచి రైతులకు శుభవార్త వినిపించింది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌ సిఫారస్‌ మేరకు కేంద్రం ఏటా కనీస మద్దతు ధరలను పెంచుతూనే వస్తోంది. దీంతో ఓ వైపు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. మరోవైపు పెరుగుతున్న ఎరువుల ధరలతో ఆందోళన చెందుతున్నారు.

తగ్గుతున్న దిగుబడులు..

జిల్లాలో ఏటా పత్తి సాగు పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది సైతం 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. అతివృష్టి, అనావృష్టి కారణంగా మూడేళ్లుగా 5 నుంచి 8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు చేయకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎరువుల ధరలు సైతం ఏటా పెరుగుతుండటం రైతులకు మరింత భారంగా మారిందని చెప్పవచ్చు.

సకాలంలో తెరుచుకోని కేంద్రాలు..

ఏటా వరి మినహా మిగిలిన కంది, పెసర, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కోతల ఆరంభంలో కాకుండా సీజన్‌ ముగుస్తున్న సమయంలో ప్రారంభిస్తూ చేతులు దులుపుకొంటోంది. వరి, పత్తి కేంద్రాలు ఏటా.. కంది, పెసర, మొక్కజొన్న కేంద్రాలు అడపా దడపా ప్రారంభిస్తుండగా, మిగతా 9 పంటల కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు.

● ఈ నెలఖరున రోహిణి కార్తెప్రారంభం కానుండటంతో వానాకాలం సాగు పనులు ఊపందుకోనున్నాయి. పంటలకు వివిధ పోషకాలు అందించేందుకు రైతులు యూరియా, డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగిస్తుంటారు. అయితే భారీగా పెరిగిన ఎరువుల ధరలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరా సాగుకు అదనంగా రూ.8 వేల వరకు అదనపు భారం పడనుందని రైతులు చెబుతున్నారు. గతేడాది నుంచి బస్తాకు రూ.50 నుంచి రూ.300 వరకు పెరగడంతో లబోదిబోమంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యుద్ధంతో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు (రూ.లలో..)

ఎరువు 2023 2024 2025 2026

డీఏపీ 1,250 1,300 1,350 1,350

ఎంఓపీ 1,400 1,535 1,800 1950

యూరియా 242 242 266.50 266.50

20–20–0–13 1,175 1,270 1,450 1,800

12–36–16 1,350 1,470 1,720 1800

14–35–14 1,450 1,700 1,850 2,350

16–16–16 1,250 1,470 1,600 1700

10–26–26 1,375 1,470 1,900 2,350

28–28–0 1650 1700 1,800 2,350

15–15–15 1450 1500 1,600 1,950

ఏటా పెరుగుతున్న పెట్టుబడులు

వరి మినహా సకాలంలో ప్రారంభం కాని ఇతర పంటల కొనుగోలు కేంద్రాలు

పత్తి విస్తీర్ణం పెరుగుతున్నా.. తగ్గుతున్న దిగుబడులు

ఆందోళనలో అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement