నారాయణపేట: జిల్లాలో ఇసుక లభ్యత గల పది రీచ్‌ల నుంచి మన ఇసుక.. మన వాహనం ద్వారా ఆన్‌లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జరిగిన డీఎల్‌ఎస్‌సీ (డిస్ట్రిక్ లెవెల్ సాండ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోటూరు, సమస్తాపూర్, నాగిరెడ్డిపల్లి, ఓబులాపురం 1, 2, దాసర్‌దొడ్డి, వడ్వాట్, అడవి సత్యారం, అమ్మపల్లి రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలన్నారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. బుకింగ్ అయిన వెంటనే త్వరగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా గత వారం కలెక్టర్ ఆదేశాల మేరకు భూగర్భ జల వనరులు, రెవెన్యూ, నీటిపారుదల, గనులు, భూగర్భజల విభాగాల అధికారులు సంయుక్తంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇసుక ఉన్న ప్రాంతాలను తనిఖీ చేసి నివేదికను సమర్పించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, మైనింగ్ ఏడీ గోవిందరాజు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం మూడోరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు గణితం–ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సుదర్శన్ రావు తెలిపారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,838 మంది విద్యార్ధులకుగాను 1,767 మంది హాజరుకాగా 71 మంది గైర్హాజరయ్యారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 500 మంది విద్యార్థులకుగాను 475 మంది హాజరుకాగా 25 మంది విద్యార్ధులు రాయలేదని చెప్పారు.
నేడు జాబ్ మేళా
నారాయణపేట రూరల్: పట్టణంలోని సీఎన్‌ఆర్ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో పుస్కల్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు క్యాంపస్ ఇంటర్వ్యూ, ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మెర్సీ వసంత, ప్రోగ్రాం ఇన్‌చార్జ్ షేక్ సుజత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొ త్తం 60 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఎంపికై న అభ్యర్థులు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటర్, డిగ్రీ చదివి మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్న వారు హాజరుకావాలని కోరారు. మక్తల్, అయిజ, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని.. నెలకు రూ.15 వేల వేతనంతో పాటు టీఏ, డీఏ చెల్లిస్తారని, పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.


