నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించడంతో పాటు గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు, రెవెన్యూ, పశు వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లావ్యాప్తంగా అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, పశువుల అక్రమ రవాణాపై నిఘా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్‌ను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని సరిహద్దు చెక్‌పోస్టుల్లో పోలీసు సిబ్బందితో పాటు వెటర్నరీ డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండి తనిఖీలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మక్తల్, మద్దూర్, కోస్గి సంతలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. పశువుల రవాణా సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పత్రాలు, ఫిట్ ఫర్ ట్రానన్స్‌పోర్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అక్రమ రవాణాలో పట్టుబడిన ఆవులు, లేగ దూడలను తాత్కాలిక గోశాలల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సామాజిక మాధ్యమల్లో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్, ఆర్డీఓ రమేష్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, సైదులు, రాంలాల్, భగవంత్‌రెడ్డి పాల్గొన్నారు.


