● కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి,
సంక్షేమ పథకాల ప్రారంభాలకు
ఎంపీని ఆహ్వానించరా?
● రేషన్ దుకాణాల్లో
ప్రధాని ఫొటో ఉండాల్సిందే..
● జింకల సమస్యను పరిష్కరించండి
● ‘దిశ’ సమావేశంలో ఎంపీ డీకే అరుణ
నారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మూడో సమావేశాన్ని ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. 45 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు.
ప్రొటోకాల్ పాటించరా..?
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తారా.. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా ఎంపీగా ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు.. ప్రొటోకాల్ పాటించకపోవడంలో ఆంతర్యామేమిటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏ శాఖకు నిధులు మంజూరైనా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నా కచ్చితంగా తన సమయం తీసుకొని చేయా లని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందు లుంటే తనకు చెప్పాలంటూ చురకలంటించారు.
● ధన్వాడలో డిగ్రీ కళాశాల భూమిపూజ ఎవరిని అడిగి చేశారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. కళాశాల నిర్మించాల్సిన స్థలం ఆక్రమణకు గురైందని.. తక్కువ స్థలంలో నిర్మించాలని చూస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఒకరిద్దరి సంతోషం కోసం కళాశాల నిర్మించడం తప్పని హితవు పలికారు.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి..
మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందా లేదా? వేసవిలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ ఈఈని ఎంపీ ఆదేశించారు. కేంద్రం ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నా.. రేషన్ దుకాణాల్లో మాత్రం కేవలం సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో మాత్రమే పెడుతున్నారని.. ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని నిలదీశారు. ఇకపై ప్రతి దుకాణంలో సీఎంతో పాటు పీఎం ఫొటో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉజ్వల పథకం కింద దరఖాస్తు చేసు కున్న వారికి సిలీండర్లు ఇవ్వాలని సూచించారు. రూ.300 రాయితీ అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఊట్కూర్, మక్తల్ ప్రాంతాల్లో ని పంట పొలాల్లో జింకల సంచారం అధికంగా ఉందని.. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎంపీ ప్రశ్నించగా.. ఓటరు జాబితా తయారు చేస్తున్నామని, త్వరలోనే నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చేనేత, జౌళిశాఖ అధికారి బాబు తెలిపారు.
పథకాలన్నీ ప్రజలకు చేరాల్సిందే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని కోరారు.
● గత సమావేశంలోని అంశాలు.. ఆయా శాఖ లు తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు. తొ లుత డీపీఓ సుధాకర్‌రెడ్డి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 272 గ్రామపంచాయతీలకుగాను 201 జీపీలకు సొంత భవనాలున్నాయని తెలిపా రు. స్పందించిన ఎంపీ ఇప్పటికీ సొంత భవనాలు లేకపోవడం ఏమిటన్నారు. గతంలో చాలామంది సర్పంచులు చేసిన పనులకు నేటికీ బిల్లు లు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
● డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. జయచంద్రమోహన్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ కింద జిల్లాలో 2,533 మంది రూ.10 లక్షలలోపు లబ్ధి పొందారన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యులు ఉన్నారా లేదా అని ఎంపీ ఆరా తీశారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాలను డీఏఓ జాన్ సుధాకర్ వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పారదర్శకంగా జరగాలని ఎంపీ సూచించారు. పీఎం సూర్యఘర్ కింద 134 దరఖాస్తులు వచ్చినట్టు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నవీన్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్రం వాటా ఉంటుందని.. పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్‌ను ఎంపీ ఆదేశించారు. జిల్లాలో 19 పీఎంశ్రీ స్కూళ్లు ఉన్నాయని డీఈఓ గోవిందరాజులు తెలిపారు. జిల్లాలో ఎన్ని అంగన్‌వాడీ టీచ ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌ను ఎంపీ ప్రశ్నించగా 33 టీచర్, 203 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కోటకొండ–కోయిలకొండ మధ్యలో రహదారి పను లు ఎందుకు నిలిచిపోయాయని, ఎన్‌హెచ్ విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. బ్యాంకర్లు రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, మిగతా లక్షా్యాలను పూర్తి చేయాలని ఎల్‌డీఎంకు ఆమె సూచించారు.
●జిల్లాకేంద్ర మున్సిపాలిటీలో రూ. 27.66 కోట్లతో చేపట్టిన వాటర్ ట్యాంకుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఎంపీ అరుణ ప్రజా ఆరోగ్యశాఖ అధికారిని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని ఎర్రగుట్ట, టీవీటవర్ వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు పెద్ద ట్యాంకుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, అలాగే 5 లక్షల లీటర్ల ట్యాంకు నిర్మాణం ప్రారంభం అవుతోందని అధికారి వివరించారు.
● చివరగా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లా డుతూ.. దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసు కోవాలని, అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలు చేపట్టే పనులు ప్రారంభించినప్పుడు ప్రొటోకాల్ తప్పక పాటించాలని ఆదేశించారు. స మావేశంలో పుర చైర్‌పర్సన్ కొండా శ్వేతా, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, దిశ కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎస్‌ఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


