ధాన్యం నిల్వలకు అవసరమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం నిల్వలకు అవసరమైన ఏర్పాట్లు

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

కోస్గి రూరల్‌/కొత్తపల్లి: రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా సమకూర్చుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీను ఆదేశించారు. గురువారం ఆయన మద్దూర్‌, దమ్‌గాన్‌పూర్‌ కోస్గి, చెన్నారం, గుండుమాల్‌లోని వరి కొనుగోలు కేంద్రాలను, జాదరావుపల్లిలోని రైస్‌మిల్‌, కోస్గిలోని వెంకటసాయి రైస్‌మిల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దామరగిద్ద, మద్దూర్‌, కొత్తపల్లి, గుండుమాల్‌, కోస్గిలో ఏర్పాటుచేసిన కోనుగోలు కేంద్రాల నుంచి రోజు 15 వేల బస్తాల ధాన్యం రైస్‌మిల్లులకు వస్తుందని.. అవసరమైన స్థలం, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 100 మంది హమాలీలు ఉండగా.. కేవలం 15 లారీలను మాత్రమే దించుకుంటున్నారని చెప్పారు. వారం రోజుల్లో ధాన్యం అధికంగా వస్తుందని.. తరలింపులో జాప్యం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను పిలిపించుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి రామకృష్ణ తదితరులు ఉన్నారు.

బాధ్యతలు చేపట్టిన ఆర్డీఓ

నారాయణపేట: రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ)గా ఎల్‌.రమేష్‌ గురువారం స్థానిక ఆర్డీ ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంకను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్‌ ఆర్డీవోకు సూచించారు.

ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం

నారాయణపేట రూరల్‌: మంచి ఆహారం తీసు కున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌ అన్నారు. గురువారం మండలంలోని కోటకొండలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామభారతి, సత్యదర్శనం ఫౌండేషన్‌ సహకారంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రకృతి వ్యవసాయంతో నేల, నీరు కలుషితం కాకుండా కాపాడవచ్చని, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించారు. ఈ పథకంలో సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న 125 మంది రైతులను గుర్తించి శిక్షణ ఇచ్చామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అందిస్తుందని, మార్కెట్‌లో ఆయా పంటలకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిపారు. కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, వరి, జొన్న, కంది, పెసర తదితర వాటిని సేంద్రియ విధానంలో పండించాలని కోరారు. సర్పంచ్‌ వెంకట్రాములుగౌడ్‌, ఉప సర్పంచ్‌ చెన్నప్ప యాదవ్‌, మండల వ్యవసాయ అధికారి దినకర్‌, ఏఈఓ అనిల్‌, ఫౌండేషన్‌ సభ్యులు సత్యనారాయణ, సఖి, సువర్ణ, జ్యోతి, రైతులు ప్రభంజన్‌రావు, రామకృష్ణ, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 2026–27 విద్యాసంవత్సరం 1వ తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్‌ ఖలీల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న బాల బాలికలకు హైదరాబాద్‌లోని రామంత పూర్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదన్నారు. 1.6.2019 నుంచి 31.5. 2020లోపు జన్మించిన వారు అర్హులని, జిల్లాకు ఒక సీటు మాత్రమే కేటాయించినట్లు పేర్కొన్నారు. జూన్‌ ఒకటిన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో లక్కీడిప్‌ ద్వారా ఒకరికి అడ్మిషన్‌ కల్పిస్తామని చెప్పారు. దరఖాస్తు గడువు ఈ నెల 28తో ముగుస్తుందని.. మీ–సేవ ద్వారా పొందిన జనన, కుల, ఆదాయం, స్థానిక తదితర ధ్రువపత్రాలను దరఖాస్తుకు జత పర్చాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement