ధాన్యం తరలింపు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం తరలింపు వేగవంతం

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

సభ్యత్వ నమోదు కేంద్రం ప్రారంభం..

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట/కొత్తపల్లి: కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లారీల్లో రైస్‌మిల్లులు, గోదాంలకు తరలించి త్వరగా దించుకునేలా చూడాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం ఆమె ఎస్పీ డా. వినీత్‌కుమార్‌తో కలిసి మద్దూరు, పల్లెగడ్డతండా, దోరేపల్లి, గుండుమాల్‌, అమ్లికుంట కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంతవరకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం విక్రయానికి వస్తుంది, ప్రస్తుతం కేంద్రంలో ఎన్ని బస్తాలు ఉన్నాయని మద్దూరు కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి ఆరా తీశారు. ఇప్పటి వరకు 13 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని.. మరో 10 వేల బస్తాలు విక్రయానికి వచ్చే అవకాశం ఉందని, కేంద్రంలో 5 వేల బస్తాలున్నాయని, లారీల కొరత కారణంగా లోడింగ్‌ నిలిచిందని కలెక్టర్‌కు వివరించారు. వెంటనే డీటీఓ మేనకాగాంధీకి ఫోన్‌ చేసి మద్దూరు, గుండుమాల్‌, కోస్గి పరిధిలోని కేంద్రాల్లోని ధాన్యం తరలింపునకు వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. పల్లెగడ్డతండా కేంద్రంలో ధాన్యం కుప్పలను చూసి తేమశాతం, ప్యాడీ క్లీనర్‌ను పరిశీలించారు. ధాన్యం తరలింపునకు 4 లారీలు కావాలని నిర్వాహకులు కోరగా.. బుధవారం సాయంత్రం వరకు ధాన్యం తరలించాలని పౌరసరఫరాలశాఖ అధికారి సైదులును ఆదేశించారు. దోరేపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల తుకాన్ని పరిశీలించారు. నిల్వ ఉన్న బస్తాలను అవసరమైతే ట్రాక్టర్లతో మిల్లులకు తరలించాలని సూచించారు. కేంద్రంలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. గుండుమాల్‌ కేంద్రానికి వెళ్లి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయని నిర్వాహకుడిని ప్రశ్నించగా 70 మందికి చెల్లించినట్లు తెలిపారు. ట్యాబ్‌ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కోస్గి మండలం కడెంపల్లిలో ఉన్న మహాలక్ష్మి రైస్‌మిల్లును సందర్శించి యజమానితో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను వెంటనే దించుకొని లారీలను తిరిగి పంపించాలని సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, ఆర్టీఓ, పోలీసు శాఖల సమన్వయంతో కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని, రెండ్రోజుల పాటు అధికారులు మండలాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చివరగా గుండుమాల్‌ మండలం అమిన్‌కుంట కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన 1,500 బస్తాలు తరలింపునకు వాహనాలు రావడం లేదని, దారి ఇరుకుగా ఉన్నందున లారీలు రావడం కష్టమని, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. బుధవారం సాయంత్రం వరకు ధాన్యం తరలించాలని.. దగ్గరుండి చూసుకోవాలని తహసీల్దార్‌, వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ సైదులు, డీసీఓ హరిప్రసాద్‌, తహసీల్దార్లు మహేష్‌, భాస్కర్‌, బక్క శ్రీనివాస్‌, సీఐ సైదులు, ఏఓలు ఉన్నారు.

కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్‌ సొసైటీ నెలరోజుల ప్రత్యేక సభ్య త్వ నమోదు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చట్టబద్ధంగా ఏర్పడ్డ స్వచ్ఛంద సేవాసంస్థ అని, విపత్తుల సమయంలో సేవలందిస్తుందని, అధికసంఖ్యలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పుర వైస్‌ ఛైర్‌పర్సన్‌ మంజుల, జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ కె.సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సభ్యుడు ఆత్మరామ్‌, జిల్లా జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ కన్వీనర్లు జొన్నల సుభాష్‌, నందు పటేల్‌, రెడ్‌క్రాస్‌ పాట్రన్‌ జీఆర్‌ రెడ్డి, సభ్యులు ఉమేష్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement