డీజీపీని కలిసిన మంత్రి | - | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన మంత్రి

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

నారాయణపేట: రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్‌ను మంగళవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

బాధ్యతలు చేపట్టిన మక్తల్‌ పుర కమిషనర్‌

మక్తల్‌: స్థానిక పురపాలిక కమిషనర్‌గా రాజయ్య మంగళవారం పుర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన వడ్డేపల్లి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ వాకిటి మానస, కౌన్సిలర్లు అనిత, వెంకటేష్‌, రహీం పటేల్‌, నాలప్ప, మహేందర్‌రెడ్డి, అధికారి నాగశివ ఆయనకు పూలమొక్క అందజేసి శాలువాతో సన్మానించారు. పట్టణ ప్రజలు, పాలకవర్గం సహకారంతో పుర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు.

ప్రత్యేక తరగతులు

సద్వినియోగం చేసుకోవాలి

మరికల్‌: పదోతరగతి ఫెయిల్‌ అయిన విద్యా ర్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు కోరారు. మంగళవారం మరికల్‌ పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఉత్తీర్ణత సాధనకు కృషి..

నారాయణపేట రూరల్‌: జిల్లాకేంద్రంలోని గ్రౌండ్‌ స్కూల్‌లో పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమెడియన్‌ తరగతులను మంగళవారం జిల్లా విద్యాధికారి గోవిందరాజు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జూన్లో ప్రారంభమయ్యే ఇంటర్‌ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. హెచ్‌ఎం దత్తూరావు, కిషోర్‌ పాల్గొన్నారు.

పాలిసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

కోస్గి రూరల్‌: జిల్లాలో బుధవారం నిర్వహించే పాలిసెట్‌ (పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. జిల్లాకేంద్రంలో 3, కోస్గిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. మొత్తం 1,330 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగుతుందని.. విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని.. హాల్‌టికెట్‌, ఆధార్‌కార్డు, పెన్సిల్‌, పెన్ను వెంట తెచ్చుకోవాలని, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదన్నారు.

నిల్వ వివరాలు

విధిగా నమోదు చేయాలి

కొత్తపల్లి (మద్దూరు): దుకాణదారులు ఎరువు లు, పురుగు మందులు, విత్తనాల నిల్వ వివరాలను రికార్డులు, ఈ–పాస్‌ యంత్రంలో విధిగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ సూచించారు. మంగళవారం ఆయన మద్దూరులోని శ్రీనివాస, వరలక్ష్మి ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు విక్రయించే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు విధిగా బిల్లు అందించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement