నారాయణపేట రూరల్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్ల మెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగా ఒక నిమిషం నిబంధన లేకపోవడం, పరీక్ష సమయానికి ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఇచ్చారు. జిల్లాలో 3,671 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 3,408 జనరల్, 263 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరం జనరల్‌లో 2,318 మంది, ఒకేషనల్‌లో 195 మంది.. అదేవిధంగా సెకండ్ ఇయర్‌లో జనరల్ 1,090 మంది, ఒకేషనల్‌లో 68 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి.
సిబ్బంది కేటాయింపు ఇలా..
జిల్లావ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నారాయణపేటలో 3, మక్తల్‌లో 2, కోస్గి 2. ధన్వాడ, మద్దూర్‌లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 9 మంది సీఎస్‌లు, 9 మంది డీఓలు, ముగ్గురు అడిషన ల్ సూపరింటెండెంట్లు, ఒక కస్టోడియన్, ఒక ఫ్లయింగ్, ఒక సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20 మందికి ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లు నియమించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించారు. తగిన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి వైద్యసిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది.


