మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యత లేదని.. కాంట్రాక్టర్లు సక్రమంగా చేయడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం పుర కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొందరు భూ నిర్వాసితులకు డబ్బులు రాలేదని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరిగాలేక 80 శాతం మంది రైతులు బయటి మార్కెట్‌లో విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, బీఆర్‌ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.


