సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

సాగుకు ప్రోత్సాహం

May 12 2026 1:38 AM | Updated on May 12 2026 1:38 AM

జిల్లాలో సాగు అంచనా..

జిల్లాలో కొనసాగుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

9 మండలాలు.. 40 గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు

వానాకాలం సాగుకు సూచనలు

ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు

–8లో u

మరికల్‌: ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ వానాకాలం పంటల సాగుకు రైతులను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వానాకాలంలో సాగు చేసే పంటలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు రైతు ముంగిటకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా రైతులు ఎక్కువగా వరి, కంది, పెసర, ఆముదం, పత్తి, పచ్చజొన్న సాగు చేస్తారు. నేటికీ అనేకమంది రైతులు పాత పద్ధతులు ఆచరిస్తున్నారు. దీంతో పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గడం, పొలాలు సారం కోల్పోయి చౌడు నేలలుగా తయారవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త ప్రణాళికలు రూపొందించారు.

ఐదు బృందాలుగా శాస్త్రవేత్తలు..

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్త డా. టి.రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఐదు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లాలోని కోస్గి, మాగనూరు, నారాయణపేట, మద్దూరు, కృష్ణా, మక్తల్‌, ధన్వాడ, మరికల్‌, ఊట్కూర్‌ మండలాల్లోని 40 గ్రామాల్లో గత నెల 27 నుంచి ఈ నెల 23 వరకు సాగు పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాంత రైతులు వర్షాకాలం సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఏ పంటలు సాగుచేయాలి, మేలైన రకాలు, విత్తనాల లభ్యత, ఎరువుల వినియోగం, యూరియా ఎక్కువగా వాడితే తలెత్తే సమస్యలు, సంక్రమించే తెగుళ్లు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు పొలాల దగ్గరకు వచ్చి సూచనలు చేస్తున్నారు.

రైతుల సంఖ్య 1.92 లక్షలు

సాగు విస్తీర్ణం 4.34 లక్షల ఎకరాలు

వరి 1.90 లక్షల ఎకరాలు

పతి 1.80 లక్షల ఎకరాలు

కంది 60 వేల ఎకరాలు

ఆముదం రెండు వేలు

పెసర వెయ్యి ఎకరాలు

పచ్చజొన్న వెయ్యి ఎకరాలు

Advertisement
 
Advertisement
Advertisement