అంతర్మథనంలో శ్రేణులు..
● పట్టువీడని ఆశావహులు..
బీజేపీలో మల్లగుల్లాలు
● తుది నిర్ణయం ఎంపీ డీకే అరుణదే!
● కమలంలో ముసలానికి తెరపడేనా?
నారాయణపేట: స్థానిక పురపాలికలో నేటికీ కో–ఆప్షన్ ఎన్నిక పూర్తి కాలేదు. పుర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 11 మంది విజయం సాధించి, మరో స్వతంత్ర అభ్యర్థిని పార్టీలో చేర్చుకొని ఎంపీ డీకే అరుణ ఎక్స్‌ఆఫీషియా ఓటుతో చైర్‌పర్సన్‌గా కొండ శ్వేతా, వైస్ చైర్‌పర్సన్‌గా జి.మంజుల ఎన్నికై న విషయం పాఠకులకు విధితమే. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నల్లెరుమీద నడకే అని అందరూ ఊహించినా.. పార్టీ నుంచి ఆరుగురు ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేసి నెల గడుస్తున్నా.. ఇంతవరకు ఎన్నిక పూర్తి కాలేదు. పార్టీ బడానేతలు వ్యూహంతో నామినేషన్లు వేయించినా.. ఎన్నుకోవడంలో అంతర్గత కలహాలతో ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి వేస్తుండటంతో పార్టీ శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎన్నికయ్యేది ఎవరో..?
1వ వార్డు మాజీ కౌన్సిలర్ అనూషా, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ సిద్ది విశాలాక్షి, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ జయశ్రీ,, మాజీ కౌన్సిలర్ లక్ష్మి, రుక్సానా బేగం, సలావుద్దీన్ పోటీ పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు, 4వ వార్డులో తాము సిట్టింగ్ స్థానాలను త్యాగం చేశామని.. అవకాశం ఇవ్వాలంటూ అనూషా, జయశ్రీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
ముస్లిం మైనార్టీ కోటాలో..
తన వార్డులోని సలావుద్ధీన్‌కు అవకాశం ఇవ్వాలంటూ ఓ వార్డు కౌన్సిలర్ పట్టుబడుతుండగా.. మరో మైనార్టీ నాయకుడు తన సతీమణికి ఇవ్వాలని కోరుతున్నారు. మైనార్టీ కోటాలోనూ పోటీ తప్పడం లేదని తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వకుండా.. ఎన్నికల ముందు వచ్చిన వారికి ఇస్తే మేమేందుకు ఉన్నట్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో నాలుగు పురపాలికలుండగా.. మూడింట్లో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ ఎన్నిక సజావుగా సాగింది. కాని స్థానిక పురపాలికలో బీజేపీ గ్రూపు రాజకీయాలతో కో–ఆప్షన్ ఎన్నికలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆశావహులు ఆరుగురిలో నలుగురిని ఎంపిక చేసేందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
తుది ‘ఆప్షన్’ ఎంపీదే..!
పేట పుర చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక తర్వాత పాలకవర్గంపై ఎంపీ డీకే అరుణ కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర నేతలు పుర పాలకవర్గ ఎన్నికలో చూపిన చొరవ కో–ఆప్షన్ ఎన్నికపై చూపకుండా ఎంపీదే తుది నిర్ణయమని చెప్పడంలో ఆంతర్యామేమిటని శ్రేణులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగోవార్డు మాజీ కౌన్సిలర్ జయశ్రీకి అవకాశం ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ కోరినట్లు సమాచారం. మిగతా మూడు ఎవరికై నా ఇవ్వాలని విన్నవించినట్లు తెలుస్తోంది. ఎంపీకి సైతం ఇదే విషయాన్ని తెలియజేసేందుకు పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పేట పురపాలికలో తెగని పంచాయితీ
పుర ఎన్నికల నుంచి పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయని శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. కంచుకోటాగా ఉన్న పేటలో బీజేపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బడా నేత చెప్పిందే వేదంగా ఇన్నాళ్లు కొనసాగింది.. కానీ ఇప్పుడు ఏమైందంటూ ఒకింత చర్చ కొనసాగుతోంది. ఆ బడా నేత నిర్ణయాన్ని ఎవరూ కాదనరు.. కో–ఆప్షన్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని అంతర్మథనంలో కమలం శ్రేణులు పడ్డాయి. ఎంపీ డీకే అరుణ చొరవ తీసుకొని తెర దించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.


