● ఫార్మర్ రిజిస్ట్రీపై
ప్రత్యేక దృష్టిసారించాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
నారాయణపేట: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శనివారం ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనగణన, విద్యా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో వందశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు ఒక్కరోజే మిగిలి ఉందని.. ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు స్వీయ గణన చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాల్‌రాజ్, మేనేజర్ సైదులు, డీఏఓ జాన్ సుధాకర్, డీఈఓ గోవిందరాజులు, అధికారులు రాజేంద్ర ప్రసాద్, యాదయ్యశెట్టి ఉన్నారు.


