జనగణనపై అవగాహనకే వాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

జనగణనపై అవగాహనకే వాకథాన్‌

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

నారాయణపేట: జనగణన–2027లో ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకునేలా జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్‌ నిర్వహించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద జనగణన అవగాహన వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ను 10వ తేదీ వరకు సెల్‌ఫోన్‌ లేదా వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. పూర్తయిన తర్వాత వచ్చిన యూనిక్‌ ఐడీని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తే సరిపోతుందని చెప్పారు. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలను ఆర్టీఐ చట్టం కింద కూడా ఎవరికీ ఇచ్చే అవకాశం ఉండదని.. వారు అడిగే ప్రశ్నలకు ప్రజలు సరైన సమాధానాలు చెప్పి సహకరించాలని, ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. అవగాహన వాక్‌లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఓ ఖాగవాహన్‌, పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేతా, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, కౌన్సిలర్లు సత్య రఘుపాల్‌, కల్పన, సత్యమ్మ, గొల్ల రవి, డీవైఎస్‌ఓ వెంకటేష్‌ శెట్టి, పుర కమిషనర్‌ శంకర్‌, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పేట డీఆర్డీఓగా ఎన్‌.వెంకట్రాములు

నారాయణపేట: నారాయణపేట డీఆర్డీఓగా ఎన్‌.వెంకట్రాములును నియ మిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిషోర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్వకుర్తి ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై జిల్లాకు రానున్నారు. ప్రస్తుతం డీఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న మొగులప్ప కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జెడ్పీ సీఈఓగా బదిలీపై వెళ్లారు.

క్రీడా పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక

నారాయణపేట: రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలలకు జిల్లా నుంచి మంతన్‌గౌడ్‌ రంజిత్‌కుమార్‌, రత్నశ్రీ , బండి నిహారిక, ముష్టి కావేరి, సాయి మహన్విత ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్‌.వెంకటేశ్‌ శెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 13, 14 తేదీల్లో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు.

పశువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు

నారాయణపేట: పశువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, గోరక్షకులు, వీజేవైఎం సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్‌ సందర్భంగా ఎక్కడైనా గోవుల అక్రమ రవాణా జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరుగా వెళ్లి గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పశువుల అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లా పరిధిలో 6 సరిహద్దు చెక్‌పోస్టులు, ఒక అంతర్‌ జిల్లా చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంతియుత సమాజ నిర్మాణమే పోలీసుల ధ్యేయమని తెలిపారు. సమావేశంలో సీఐ శివశంకర్‌, టౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ–2 గాయత్రి పాల్గొన్నారు.

ఆలసందలు క్వింటా రూ.4,819

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం ఆలసందలు క్వింటా సరాసరి రూ.4,819 ధర పలికింది. అదేవిధంగా వరి హంసరకం రూ.1,600, సోనారకం గరిష్టంగా రూ.2,326, కనిష్టంగా రూ.1,402 ధరలు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement