రెడ్‌క్రాస్‌.. సేవల్లో టాప్‌ | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌.. సేవల్లో టాప్‌

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

పాలమూరు: అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి ఓవైపు రక్తం సమకూర్చడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ముందుంటోంది. కొన్నేళ్లుగా పాలమూరు జిల్లాలో ఆరోగ్యం, అత్యవసర సహాయం, రక్తదానం వంటి సేవల్లో మేటిగా నిలుస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో నిస్సహాయులకు చేయూత అందించడంతో పాటు గర్భిణులు, చిన్నారుల పోషణ వంటి వాటిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సేవాభావం, ఆరోగ్య అవగాహన పెంపు కోసం జూనియర్‌ రెడ్‌క్రాస్‌ వలంటీర్లను తయారు చేయడంతో.. జిల్లాలో జరిగే కురుమూర్తి, మన్యంకొండ ఇతర ముఖ్యమైన ఉత్సవాల్లో వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు.

6,130 యూనిట్ల రక్తసేకరణ

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏడాది కాలంలోనే 114 రక్తదాన శిబిరాలు నిర్వహించి.. 6,130 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌లో ఏర్పాటుచేసిన కోల్డ్‌ స్టోరేజ్‌లో అన్ని రకాల రక్త నిల్వలు అందుబాటులో ఉంటాయి. సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో పాటు తలసేమియా బాధితులకు సైతం రక్తం అందిస్తున్నారు.

ఎన్నో సేవా కార్యక్రమాలు..

పాలమూరులో గతేడాది కాలంలో 20 కంటి వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు 156 మంది కళ్లు సేకరించారు. 23 మృతదేహాలను మెడికల్‌ కళాశాలకు వితరణ చేశారు.30 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను 258 మంది లబ్ధిదారులకు అందజేశారు. 17 ప్రాంతాల్లో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2005లో మహబూబ్‌నగర్‌ ఏనుగొండలో అనాథ శరణాలయం ఏర్పాటు చేయగా.. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు 74 మంది ఉన్నారు. అదే విధంగా 9వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే వారు 14మంది ఉండగా.. ముగ్గురు డిగ్రీ, ఒకరు ఇంజినీరింగ్‌, ఇద్దరు పాలిటెక్నిక్‌, ఇద్దరు నర్సింగ్‌ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రెడ్‌క్రాస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

2018లో శాంతివనం..

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో మరో అరుదైన సేవా కార్యక్రమం శాంతివనం పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 25మంది వరకు ఉండగా.. ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులతో నిత్యం పాఠాలు భోదిస్తుంటారు. ఈ పాఠశాలలో చదువుతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

పేరు శిబిరాలు సేకరించిన

రక్తం

మహబూబ్‌నగర్‌ 114 6,130

నారాయణపేట 18 1,410

నాగర్‌కర్నూల్‌ 7 300

జోగుళాంబ గద్వాల 34 1,091

ఉమ్మడి జిల్లాలో రక్తసేకరణ ఇలా (యూనిట్లలో)..

నేడు ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం

పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ

అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా శిబిరాల నిర్వహణ

ఐదుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థుల దత్తత

అనాథ శరణాలయాల్లో 100మంది వరకు ఆశ్రయం

ఐదుగురికి విద్యానిధి..

ఎంబీబీఎస్‌ చదువుతున్న ఐదుగురు నిరుపేద విద్యార్థులను రెడ్‌క్రాస్‌ సొసైటీ దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చు భరిస్తోంది. ఎంబీబీఎస్‌ పూర్తయ్యే వరకు వారికి సంబంధించిన అన్ని రకాల బాగోగులను చూస్తోంది. విద్యార్థిని గోపిక గాంధీ మెడికల్‌ కళాశాల, హరిత కాకతీయ మెడికల్‌ కళాశాల, ఊర్మిళ ఎస్‌వీఎస్‌, ఆకాంక్ష నల్లగొండ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ముడావత్‌ లోకేష్‌ ఈఎస్‌ఐ మెడికల్‌ కళాశాల ముంబైలో చదువుతున్నాడు. ప్రతి ఒక్కరికీ కళాశాల ఫీజు, పుస్తకాలు, దుస్తులు, హాస్టల్‌ సౌకర్యాలకు అయ్యే ఖర్చు భరిస్తున్నారు.

సేవలు మరింత విస్తృతం..

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌తో అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో రూ.5 కోట్లతో మల్టీ సూపర్‌స్పెషాలిటీ డయాగ్నొస్టిక్‌ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఎస్‌డీపీ మిషన్‌ కూడా అందుబాటులో ఉంది. ఒక యూనిట్‌కు రూ.10,500 ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో అయితే రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మూడు అంబులెన్స్‌లు, ఒక మినీవ్యాన్‌ అందుబాటులో ఉంది.

– నటరాజ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement