భూసార పరీక్షలతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలతో అధిక దిగుబడులు

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

నారాయణపేట రూరల్‌: రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని జాజాపూర్‌ రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూసార పరీక్షల ఫలితాలు ఎరువుల వినియోగం, పంట దిగుబడి, నాణ్యత పెంపొందించుకునేందుకు ఉపకరిస్తాయని వివరించారు. సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలని సూచించారు. అనంతరం రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందించి వాటి ప్రత్యేకతను వివరించారు. పోషకాల స్థితి తెలుసుకొని శాసీ్త్రయ సాగు పద్ధతులను అనుసరించడంతో పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయని చెప్పారు. అంతకుముందు సమస్యలు, పంటల పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సలహాలు అందించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. సబ్‌స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజరు, సాగుకు అనుకూలం కాని భూములు, వ్యవసాయ పొలాలకు గ్రౌండ్‌ మౌంటైడ్‌ గ్రేడ్‌ కనెక్టివిటీ కింద సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించిన ధరకు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కం సంస్థలు కొనుగోలు చేస్తాయని, రైతులు లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సాయిబాబా, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నవీన్‌, మండల వ్యవసాయ అధికారి దినకర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ భాస్కర్‌, బీకేఎస్‌ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement