నారాయణపేట: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ మందిరంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా–కోయిల్‌సాగర్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, బుద్వేల్–నాచారం రింగ్‌రోడ్ భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. కోస్గి రహదారి విస్తరణలో కూడా ఏమైనా పనులు పెండింగ్ ఉంటే వెంటనే ముగించాలని ఆదేశించారు. ఆయా పనుల భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్‌డీసీ, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, ఏఓ శ్రీధర్, నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ శ్రీధర్, తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, సతీష్‌కుమార్, చింత రవి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ..
త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తనిఖీ చేశారు. పరిసరాలు, భద్రతను పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్ ఉన్నారు.
కలెక్టర్‌ను కలిసిన డీఎస్పీ..
ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను బుధవారం కలెక్టరేట్‌లో డీఎస్పీ నల్లపు లింగయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


