● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ
మంత్రి వాకిటి శ్రీహరి
ఊట్కూర్: రాష్ట్రంలోని నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సొంత ఇళ్లు నిర్మించుకొని గృహా ప్రవేశాలు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని చిన్నపొర్లలో లబ్ధిదారు కొనింటి శంకరమ్మ, భీమప్ప గృహాప్రవేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. ఈ పథకంలో లక్షలాది మంది పేదలకు ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిత్యం గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కాలయాపన చేసిందని ఆరోపించారు. అనంతరం మల్లేపల్లి శివారులో రూ.2 కోట్లతో వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గాండ్ల నిఖిత ప్రశాంత్, కతలప్ప, ఎంపీడీఓ కిశోర్, ఏఓ గణేశ్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, యగ్వేశ్వర్‌రెడ్డి, కోరం మహేశ్, ధర్మరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


