మరో రెండు కార్పొరేషన్‌ పదవులు | - | Sakshi
Sakshi News home page

మరో రెండు కార్పొరేషన్‌ పదవులు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

సరిత, గట్టు తిమ్మప్పకు

దక్కిన ‘చైర్మన్‌ గిరి’

గద్వాల:ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణ షీప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, గట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి కే శాట్‌ చైర్మన్‌గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఒబేదుల్లా కొత్వాల్‌ కొనసాగుతున్నారు.

● కొల్లె సరిత బీఆర్‌ఎస్‌ హయాంలో జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్‌ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

● గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్‌గా కూడా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement