ఎరువుల అంచనాలు..
● ఎరువులు 54,200 మెట్రిక్ టన్నులు
● విత్తనాలు 47,780 క్వింటాళ్లు
● పత్తి విత్తనాలు 3.60 లక్షల పాకెట్లు
భూమిని దుక్కుతున్న రైతు
నారాయణపేట: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. నేలల ఆధారంగా అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు పండించాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. జిల్లా రైతులు అధిక శాతం వర్షాధార పంటలపై ఆధారపడుతుండగా.. ఏటా వానాకాలంలో వరి, పత్తి, కంది, యాసంగిలో బోరుబావుల కింద వరి, వేరుశనగతో పాటు జొన్న సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఏడాది వానాకాలంలో సాగు కానున్న పంట వివరాలు, అవసరమైన ఎరువులు, విత్తనాలతో సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సూధాకర్ పర్యవేక్షణలో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు సిద్ధం చేశారు. ఎక్కువ మంది రైతులు పత్తి, కంది, వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి నివేదించారు.
సాగుకు సన్నద్ధం..
జిల్లాలో 4.66 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా.. ఎరువులు 54,200 మెట్రిక్ టన్నులు, వివిధ రకాల విత్తనాలు 47,780 క్వింటాళ్లు, పత్తి విత్తనాలు 3.60 (450 గ్రాములు) లక్షల పాకెట్లు అవసరమని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. రైతులు తొలకరి వర్షాలకై ఎదురుచూస్తున్నారు. ఎక్కువ మంది రైతులు రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తేందుకు ఆసక్తి కనబరుస్తారు. గతేడాది అకాల వర్షాలు, గులాబీ తెగులు సోకడంతో రైతులు నష్టపోయారు. ఈసారి పత్తి, కందికి డిమాండ్ ఉండటంతో ఆయా పంటల సాగుకే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదేవిధంగా వరి సాగుకు సైతం ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారు.
సాగు అంచనాలు ఇలా..
పంట సాగు విస్తీర్ణం కావాల్సిన విత్తనాలు
(ఎకరాల్లో..)
పత్తి 1.80 లక్షలు 3.60 లక్షల పాకెట్లు
వరి 1.90 లక్షలు 47,500 క్వింటాళ్లు
కంది 58 వేలు 200 క్వింటాళ్లు
జొన్న 5 వేలు 180 క్వింటాళ్లు
పెసర 5 వేలు 100 క్వింటాళ్లు
యూరియా 18 వేల మె.ట.
డీఏపీ 11 వేలు మె.ట.
కాంప్లెక్స్ 23 వేల మె.ట.
పొటాష్ 1,200 మె.ట.
ఎస్‌ఎస్‌పీ వెయ్యి మె.ట.


