సరిహద్దులో భద్రత పటిష్టం | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులో భద్రత పటిష్టం

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

నారాయణపేట: యాసంగి సీజన్‌ వరి ధాన్యం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా రాకుండా నిరోధించేందుకు, బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని.. చెక్‌పోస్టుల దగ్గర పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్‌ అన్నారు. సోమవారం మండలంలోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్ట్‌ (కర్ణాటక సరిహద్దు)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే వీడియో రికార్డింగ్‌తో తనిఖీలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా సరిహద్దు మార్గాలన్నింటిపై నిరంతర నిఘా ఉండాలని, గ్రామీణ మార్గాలు సహా అన్ని ప్రవేశ దారుల్లో తనిఖీలు కట్టుదిట్టం చేయాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, తగినంత మంచినీరు తీసుకోవాలని, వేడి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జలాల్‌పూర్‌, కానుకుర్తి, చేగుంట, కృష్ణా వంతెన, సమస్తాపూర్‌, ఉజ్జెల్లి, లాల్‌కోటలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగిస్తున్నామన్నారు.

పునరావాసానికి పూర్తి సహకారం..

జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టుల పునరావాసానికి పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ భరోసానిచ్చారు. 2026, మార్చి 3న హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన అనిల్‌కుమార్‌ (భగత్‌సింగ్‌), గద్వాలకు చెందిన భవాని అలియాస్‌ సుగుణ దంపతులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సోమవారం వారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, క్వింటాలు బియ్యం, వంట పాత్రలు అందజేశారు. ఉపాధిని ఎంచుకొని నెల తర్వాత మళ్లీ కలవాలని.. పునరావాసానికి పోలీస్‌శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు దళాన్ని విడిచి జనజీవన స్రవంతిలోకి రావడం మంచి నిర్ణయమని, అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ హుల్‌హక్‌, ఎస్బీ ఎస్‌ఐ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ డా. వినీత్‌

Advertisement
 
Advertisement
Advertisement