గడువులోగా నిర్మాణాలు పూర్తికావాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా నిర్మాణాలు పూర్తికావాలి

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. మంజూరైన ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయించాల్సిన బాధ్యత ఏఈలపై ఉందని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫణీంద్రారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, సాధించిన పురోగతిపై హౌసింగ్‌ పీడీ శంకర్‌, ఏఈలతో చర్చించారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని.. సర్పంచులతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునేలా చూ డాలన్నారు. అవసరమైన వారికి సీ్త్రనిధి రుణాలు ఇప్పించి పూర్తి చేయించాలని.. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే సమావేశం వరకు ఇచ్చిన లక్ష్యం, ఎంత వరకు పూర్తి చేశారు.. ప్రారంభించని ఇళ్లు ఎన్ని.. కారణం ఏమి టి.. ఏం చేస్తే ప్రారంభమవుతాయనే వివరాల పూర్తి నివేదికతో హాజరుకావాలని స్పష్టం చేశారు.

గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలి..

మరికల్‌: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం మండలంలోని తీలేర్‌లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం ఆరబెట్టి 15 రోజులవుతున్నా.. గన్నీబ్యాగులు ఇవ్వడం లేదని, రాత్రింబవళ్లు పడిగాపులు పడుతున్నామని రైతులు వివరించారు. టార్పాలిన్లు లేకపోవడంతో ఇళ్ల నుంచి కవర్లు తీసుకొచ్చి ధాన్యంపై కప్పి వేస్తున్నామని తెలిపారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌ టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ధాన్యం సేకరణ వివరాలను సీఈఓను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్‌ రాంకోటి, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, ఎంపీఓ పావని, సొసైటీ సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement