ధాన్యం కొనుగోళ్లు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

నారాయణపేట: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను తెలిపారు. సో మవారం హైదరాబాద్‌ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అట్లూరి లక్ష్మణ్‌ ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించారు. జిల్లా నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చివరి గింజ వరకు కొనుగోలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వరి, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే కేంద్రాలకు వరి ధాన్యం చేరుకుందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో ట్యాబ్‌ఎంట్రీ పూర్తి చేయాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ట్యాబ్‌ ఎంట్రీలు పూర్తయిన రైతులకు వారంలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీసీలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి వినతులు పరిష్కరించాలి..

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫారస్‌ చేశారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 19 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement