బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

నారాయణపేట: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, కలిసికట్టుగా ముందుకు రావాలని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్యవివాహాలు చట్టపరంగా నిషేధించబడినవని, 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహం చేయడం చట్ట ప్రకారం నేరమని స్పష్టం చేశారు. బాల్యవివాహాలు బాలల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, వారి విద్యాభ్యాసానికి మధ్యలోనే ఆటంకం కలిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా బాలికల భవిష్యత్‌, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్య భద్రతపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అజ్ఞానం, సంప్రదాయాల పేరుతో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళనకరమన్నారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాల్యవివాహాలను నిరోధించడంలో చురుకుగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాల నిరోధానికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు.

విఠలాపూర్‌ వాసికి

యువ కవి పురస్కారం

దామరగిద్ద: ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న విఠలాపూర్‌కు చెందిన మధు విశ్వపుత్రిక గజల్‌ ఫౌండేషన్‌ వారిచే ఆదివారం హైదరాబాద్‌లో యువ కవి పురస్కారాన్ని అందుకున్నాడు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను చైతన్యపరిచే కవితలకు ఈ పురస్కారానికి ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ ఉపాధ్యక్షురాలు లక్ష్మీపండిత్‌, కార్యదర్శి అనువాదకులు బిక్కి కృష్ణ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో మైనింగ్‌ విభాగాధిపతి వీడీ రాజగోపాల్‌ అవార్డు ప్రదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సర్పంచ్‌ హన్మంతు, గ్రామస్తులు అభినందించారు.

రేపు జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: వరంగల్‌లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌, 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు.

ప్రశాంతంగా ‘నీట్‌’

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో నీట్‌–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్‌ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement