ఊట్కూర్: ఇందిరమ్మ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని యువజన క్రీడల మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని ముగ్దుంపూర్‌లో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోనప్ప దంపతులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సొంతిల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఎంతోమంది నిరుపేదలు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికీ కూడా ఇళ్లను మంజూరు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇల్లు లేని వాళ్లే ఉందకూడదని, విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేద్దామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలేష్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, ఎల్కోటి జనార్దన్‌రెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి, కోరం మహేష్‌రెడ్డి, రవికుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


