నారాయణపేట: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మైనార్టీల సంక్షేమానికి రూ.3,500 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారని.. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. పేటలో ఇప్పటికే 200 పైచిలుకు కుట్టుమిషన్లు పంపిణీ చేశామని.. మరో 350 మిషన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 204 టెమ్రిస్ పాఠశాలలు, కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. అదనంగా డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు చదువే ప్రధాన ఆయుధమని.. కార్పొరేషన్ ద్వారా అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దళారులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా సాయం అందేలా ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని అమలు చేస్తున్నామని, కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పారదర్శకంగా ఎంపిక చేపడుతోందని వివరించారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వృత్తిదారులకు మద్దతుగా తుర్కా కోష ద్వారా రూ.12 కోట్లతో జనరేటర్లు పంపిణీ చేస్తామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను మైనార్టీ వర్గాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, మైనార్టీ అధికారి రషీద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమూద్ ఖురేషి, మైనార్టీ నాయకులు మహ్మద్ గౌస్, ఖాజాసాబ్, మహ్మద్ ఖాజా, మహ్మద్ రఫీ, కుతుబుద్దీన్, అబ్దుల్ ఖదీర్, సర్ఫరాజ్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.


