నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే నెల 2న నియోజకవర్గస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని అంజనా గార్డెన్‌న్స్‌లో శనివారం ఉదయం 9 గంటలకు నియోజకవర్గస్థాయి ప్రగతి ప్రణాళిక సభ ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షిస్తూ ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ చర్యలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగ ప్రగతి తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు సూచించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు.


