మరికల్: గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరేందుకు తైబజారు పేరిట ప్రభుత్వం ఏటా బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. కానీ వారాంతపు సంతలు, పశువుల మార్కెట్‌లో కనీసం మౌలిక వసతుల కల్పనలో పంచాయతీ పాలకవర్గాలు అశ్రద్ధ చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంతలకు ఆదరణ లేదంటూ వేలంపాట దారులు కుమ్మకై ్క తక్కువ పాట పాడుతూ సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోపక్క మేజర్ గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు తైబజార్ డబ్బుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారు.
వారాంతపు సంతలు..
జిల్లాలోని 13 మండలాలు ఉండగా మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామాల్లో వారాంతపు సంతలు నిర్వహిస్తారు. నారాయణపేట, మక్తల్, మరికల్, కోస్గిలో జరిగే సంతలకు వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఏటా తైబజార్ వేలం నిర్వహిస్తారు. గతేడాది మరికల్ తైబజార్ వేలం జిల్లాలోనే అత్యధికంగా రూ.13 లక్షలు పలికింది. ఈ ఏడాది పాటదారులు కుమ్మకై ్క రూ.8 లక్షలకు దక్కించుకున్నారు. ఈ డబ్బులను సంతలో వసతుల కల్పనకు వెచ్చించాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో పక్కదారి పడుతున్నట్లు వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కనీస సౌకర్యాలు కరువు..
అధికారులు తైబజార్ వేలం నిర్వహణకు చూపుతున్న శ్రద్ధ వసతుల కల్పనపై చూపడం లేదు. సంతలకు వచ్చే చిరువ్యాపారులు, కొనుగోలుదారులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, నీడ, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. సంతలో కూరగాయలు విక్రయించేందుకు అత్యధికంగా మహిళ ఉంటారు. వీరు ఉదయం వచ్చి రాత్రి వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరికల్‌లో వారాంతపు సంత నిర్వహణకు ప్రత్యేక స్థలం లేదు. గతంలో పాత బస్టాండ్ దగ్గర నిర్వహించారు. అక్కడ స్థలం తక్కువగా ఉండటంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా.. అక్కడి నుంచి జాతీయ రహదారి, మాధవరం రోడ్డుకు మార్చారు. అక్కడ కూడా వాహనాల రాకపోకలతో ఇబ్బందులు కలుగుతుండటంతో బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్చారు. ఈ స్థలంలోనే కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు గత ప్రభుత్వ హయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భూమి పూజ కూడా చేసినా.. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అలాగే ధన్వాడ, దామరగిద్ద, మక్తల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, కోస్గి, మద్దూరులో కూడా వారాంతపు సంతలు రోడ్లకు ఇరువైపునే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా పంచాయతీ కార్యదర్శులు మౌలిక వసతులు కల్పించకపోవడంతో అటూ వ్యాపారులు, ఇటూ కొనుగోలుదారులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.
కనీస సౌకర్యాల కల్పనలోఅధికారులు విఫలం
ఇబ్బందులు పడుతున్న
చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు
తైబజార్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ
వసతుల కల్పనపై లేదని ఆరోపణ
జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి


