ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

మొర్రం, మట్టి రవాణాకు ఆన్‌లైన్‌ అనుమతి

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

నారాయణపేట: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘మన ఇసుక.. మన వాహనం’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన ఇసుక మన వాహనం ఆన్‌లైన్‌ విధానంలో జిల్లాలో ఇసుక రవాణా జరగాలని స్పష్టం చేశారు. జిల్లాలో గుర్తించిన ఐదు రీచ్‌ల నుంచి ఇసుక రవాణా జరగాలని, అక్రమంగా తరలిస్తే వాహనాలను సీజ్‌ చేయాలన్నారు. కోస్గి, మాగనూరు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇకపై ఎక్కడా జరగడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. తహసీల్దార్లు, ఎస్‌ఐలు, ఎంపీడీఓలు సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఇవ్వాలని.. మొర్రం, మట్టి రవాణాకు సైతం ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇచ్చేలా త్వరలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఎస్పీ డా. వినీత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి నష్టం కలగకుండా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని వాహనాలను సీజ్‌ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందితే దాడులు చేసి వాహనాలను సీజ్‌చేసి పోలీసుస్టేషన్‌కు తరలించాలన్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మన ఇసుక మన వాహనం దరఖాస్తు ప్రక్రియను వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, ఆర్డీఓ రాంచందర్‌ నాయక్‌, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్‌, సైదులు, జిల్లాలోని మూడు సర్కిళ్ల సీఐలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్‌ఐలు, మైనింగ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement