అన్నీ అనుకూలిస్తే.. | - | Sakshi
Sakshi News home page

అన్నీ అనుకూలిస్తే..

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

కొల్లాపూర్‌: గత కొన్నేళ్లుగా మరమ్మతుకు నోచుకోని కేఎల్‌ఐ మోటార్లకు ఈసారి తప్పనిసరిగా చేపట్టాలనే పట్టుదలతో అధికారులు ఉన్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈసారి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ మార్చి నెలలోనే భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఇదే అనువైన సమయం అని నీటిపారుదల శాఖ భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో మరమ్మతు చేపట్టే అవకాశం ఉందని, లేదంటే మరో ఏడాది ఆగాల్సిందేనని వారు పేర్కొంటున్నారు.

నిధుల కేటాయింపు

కేఎల్‌ఐలో పాడైన మోటార్ల మరమ్మతుకు గతేడాది ప్రభుత్వం రూ.18.80 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మూడో నంబర్‌ మోటార్‌ మరమ్మతు కోసం రూ.15 కోట్లు కేటాయించగా.. ఐదో నంబర్‌ మోటార్‌కు స్పిల్‌ భీమ్‌, కాంక్రీట్‌ వర్క్స్‌, సర్జిపూల్‌లోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట ఏర్పాటు కోసం రూ.3.80 కోట్లు కేటాయించింది.

మిషన్‌ భగీరథ కారణంగా..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి జిల్లాలకు ఎల్లూరు సమీపంలోని మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ స్కీంకు కేఎల్‌ఐ ప్రాజెక్టు నుంచే నీటిని ఎత్తిపోస్తున్నారు. మిషన్‌ భగీరథ స్కీం లేక ముందు ఎల్లూరు పంపుహౌజ్‌లోని మోటార్లకు వేసవిలో రెండు నెలలపాటు విరామం ఇచ్చేవారు. మిషన్‌ భగీరథ స్కీం వచ్చాక విరామం లేకుండా ఏడాది మొత్తం ఎల్లూరు పంప్‌హౌజ్‌ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. దీంతో పాడైన మోటార్లకు సకాలంలో మరమ్మతు చేపట్టేందుకు వీలు కావడం లేదు.

బ్యాక్‌వాటర్‌ తగ్గుముఖం..

దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది మార్చి నెల నుంచే శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ భారీగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ లెవెల్స్‌ 821 అడుగులుగా ఉండగా.. 805 అడుగుల వరకు కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. మిషన్‌ భగీరథ స్కీంకు నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోని నీటిని మళ్లిస్తే కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలకు విరామం లభిస్తుంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే వచ్చే నెలలో నీటి ఎత్తిపోతలు నిలిపివేసి.. మోటార్లకు మరమ్మతు చేపట్టే యోచనలో అధికార యంత్రాంగం ఉంది.

వచ్చే నెలలో కేఎల్‌ఐ మోటార్ల మరమ్మతుకు అధికారుల చర్యలు

రూ.18.80 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

మరోవైపు మిషన్‌ భగీరథకు కొనసాగుతున్న ఎత్తిపోతలు

ప్రస్తుతం 821 అడుగుల ఎత్తులోశ్రీశైలం బ్యాక్‌వాటర్‌

బ్యాక్‌వాటర్‌ భారీగా తగ్గిపోవడంతోఅనుకూలంగా భావన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement