20 నెలల్లో పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

20 నెలల్లో పూర్తిచేస్తాం

Mar 9 2026 7:22 AM | Updated on Mar 9 2026 7:22 AM

కృష్ణానదిలో మన వాటా నీటిలో బొట్టు కూడా వదిలిపెట్టం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే 20 నెలల్లో పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి పాలమూరులోని ముఖ్యమైన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్‌ ప్రాజెక్టుల పనులను 2027 మార్చి నాటికి పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణానదిలో ఉన్న హక్కు మేరకు నీటిని పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్ర త్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. వచ్చే ఏడా ది కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.909 కోట్లు, నెట్టంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ పనులను మిషన్‌ మోడ్‌లో పూర్తి చేసేందుకు భూ సేకరణ, పునరావాస చర్యలను వేగవంతం చేస్తున్నామని వివరించారు.

భూ సేకరణకు ప్రత్యేక చర్యలు

సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు. ఈ పనుల కోసం జూన్‌ 2 నాటికి రూ.5 వేల కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2014 తర్వాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పాలమూరు– రంగారెడ్డి పథకంలో నీటి ఎత్తిపోతల పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల ఖర్చు పెరిగి రాష్ట్రానికి నష్టం వాటిల్లిందన్నారు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో తుమ్మిడిహట్టి స్థానంలో మేడిగడ్డను ఎంచుకోవడం కూడా తెలంగాణ రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. అన్ని పనులు పారదర్శకంగా, చట్టబద్ధంగా చేపడతామని స్పష్టం చేశారు. కృష్ణానది పరివాహకంలోని రైతులకు సాగునీరు, పంటల ఉత్పత్తి పెరుగుదల, ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు కేంద్రిత విధానాలతో ముందుకెళ్తోందన్నారు. తమ ప్రభుత్వం 2023 డిసెంబర్‌ 7 నుంచి ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.7,161 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇందులో ప్రాజెక్టు పనులకు రూ.6,718 కోట్లు, భూ సేకరణకు రూ.284.71 కోట్లు, పునరావాసానికి రూ.63.65 కోట్లు, ఇతర పనులకు రూ.94 కోట్లు వెచ్చించామన్నారు.

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై

సమీక్షా సమావేశం

హాజరైన ఉమ్మడి జిల్లాలోని

మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement