గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం
కోస్గి రూరల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చంద్రవంచలో రూ.3 కోట్లతో నిర్మించిన 33 కేవీ సబ్‌స్టేషన్, ముశ్రీఫాలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను వారు ప్రారంభించారు. కడా నిధులు రూ.కోటితో అదనపు తరగతి గదుల నిర్మాణం, గుండుమాల్ మండలం బలుభద్రాయపల్లిలో రూ.4.20 కోట్లతో నిర్మించే 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందజేస్తామని, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, జిల్లా విద్యాధికారి గోవిందరాజు, విద్యుత్ ఎస్‌ఈ నవీన్‌కుమార్, డీఈ నర్సింహరావు, డీపీఓ భిక్షపతి, ఎంపీడీఓ శ్రీధర్, ఏడీ సుధారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, ఏఈ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


