ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి
దామరగిద్ద: హిందూ ధర్మం కోసం పోరాడిన ఛత్రపతి శివాజీని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని స్వామి ఆదిత్య పరాశ్రీ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని సర్పంచ్ కన్కిరెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సంఘటితమై ఆధ్యాత్మిక బానిసత్వం నుంచి హిందువులను జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హిందువుగా జన్మించి అన్యమతాలను అనుసరిస్తూ ధర్మ ద్రోహానికి పాల్పడటం అవివేకమని తెలిపారు. అనంతరం వక్తలు రవీంద్రనాథ్, విగ్రహ దాత వన్నడ వెంకటప్ప శివాజీ గొప్పతనాన్ని వివరించారు. అంతకుముందు శివాజీ చిత్రపటంతో యువకులు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఉప సర్పంచ్ సత్యనారాయణ, విండో మాజీ అధ్యక్షుడు ఈదప్ప, మాజీ సర్పంచ్‌లు భీమయ్యగౌడ్, రవీంద్రనాథ్, వన్నడ ఆశమ్మ, గోపాలరావు, విగ్రహ కమిటీ అధ్యక్షుడు వెంకటప్ప, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రాఘవేందర్‌గౌడ్, మాణిక్, వన్నడ చంద్రకాంత్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
శోభాయాత్రను పర్యవేక్షించిన ఎస్పీ
నారాయణపేట: ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జిల్లా పరిధిలో నిర్వహించిన శోభాయాత్రలు, బైక్ ర్యాలీలను ఎస్పీ డా. వినీత్ జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించారు. నారాయణపేట, కోస్గి, మద్దూర్, మక్తల్, ఉట్కూర్, మరికల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను వీహెచ్‌ఎఫ్ సెట్ ద్వారా ఆదేశించారు. ర్యాలీల మార్గంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలు శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో డయల్ 100కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎస్‌ఐ నరేష్, ఐటీ కోర్ టీం శ్రీనివాసులు ఉన్నారు.
విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతున్న స్వామి ఆదిత్య పరాశ్రీ
ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి


