బెదిరింపులు.. బుజ్జగింపులు!
● బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలో రెబెల్స్ బెడద
● ఉపసంహరించుకుంటారా.. పోటీలో నిలుస్తారా?
నారాయణపేట: పుర ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పార్టీలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు నా మినేషన్లు వేశారు. సీఎం ఇలాఖాలోని కోస్గి పురపాలికలో కాంగ్రెస్‌పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రసన్నకుమారి సైతం రెబల్‌గా నామినేషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. మద్దూర్‌లోని పలు వార్డుల్లో రెబల్స్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నారాయణపేట పురపాలికలో కాంగ్రెస్‌పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి సరిత హరినారాయణభట్టడ్ నామినేషన్ వేసిన 16వ వార్డులో రెబల్‌గా బుస్సయ్యస్వామి సతీమణి సుజాత నామినేషన్ వేయడంతో పరేషాన్‌లో పడ్డారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థి సరితకు చెందిన బాలాజీ జువెల్లర్స్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న బుగ్గప్ప ఒకటోవార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ దిగడం చర్చనీయాంశంగా మారింది. 8వ వార్డులో బుల్లెట్ రాజు తల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్‌గా రంగంలోకి దిగారు. 11వ వార్డులో మాజీ సింగిల్‌విండో డైరెక్టర్ మల్లేష్ సతీమణి, ఆయన సోదరుడి సతీమణిని సైతం రంగంలోకి దింపారు.
● పేట మున్సిపాలిటిలోని 4, 17 వార్డులో అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు వెనక్కు వేస్తోంది. 17వ వార్డు టికెట్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుస్సయ్య స్వామి ఆశిస్తుండగా.. ముందుగా శోభారాణి రాజును నామినేషన్ వేయించారు. ఆ వార్డు బీజేపీ కంచుకోటగా భావించిన కాంగ్రెస్ వెంటనే సమాలోచనలు జరిపి గందె ఉమాకాంత్ సతీమణితో చివరిరోజు నామినేషన్ వేయించారు. బుస్సయ్య స్వామికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కోడలు పవిత్రను కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ వేయించారు. పక్కనే ఉన్న 16వ వార్డులో కాంగ్రెస్‌పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి సరితపై బుస్సయ్య స్వామి సతీమణి సుజాతను నామినేషన్ వేయించడంతో పరేషాన్‌లో పడ్డారు.
● మద్దూర్‌లోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రతాప్‌రెడ్డి చెప్పుకొచ్చారు. బెదిరింపులకు భయపడమని తేల్చిచెప్పా రు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో రెబల్స్‌ను బుజ్జగించే ప్రయత్నంలో ఆయా పార్టీల ప్రధాన నాయకులు ఉన్నారు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీలిస్తున్నారు. అయితే రెబల్స్ నామినేషన్లు ఉపసంహరించుకుంటారా.. లేదా పోటీలో ఉంటారా వేచి చూడాల్సిందే మరి.
సీఎం ఇలాఖాలోనూ..
సీఎం ఇలాఖాలోని కోస్గి పురపాలికలో 16 వార్డులుండగా.. దాదాపు మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థులకు రాకపోవడంతో రెబల్‌గా పోటీ చేసేందుకు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. సీఎం ఆదేశాలతో నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 1వ వార్డులో అనిత (కాంగ్రెస్ రెబల్), 2వ వార్డులో కాంగ్రెస్‌పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్నకుమారి, యాదమ్మ, 5వ వార్డులో వెంకటయ్య, 6వ వార్డులో దమయంతి, 7వ వార్డులో సలీం, శ్రీనివాస్, 9వ వార్డులో ప్రబోత్తం, 10వ వార్డులో పద్మమ్మ, 11వ వార్డులో వనజ, సుష్మిత, 12వ వార్డులో రాంబాబు, సోమశేఖర్, వేణుగోపాల్, 15వ వార్డులో ఆనంద్‌గౌడ్, బిచ్చప్ప, 16వ వార్డులో ఉజ్వల్ రెబల్‌గా నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగిస్తూ విత్‌డ్రా చేయించే పనిలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. చివరకు పోటీలో ఉంటారా లేక ఉపసంహరించుకుంటార అనేది వేచి చూడాల్సిందే మరి. 1వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కె.లక్ష్మి రెబల్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.
బెదిరింపులు.. బుజ్జగింపులు!


