ప్రజల సహకారం కీలకం : ఎస్పీ
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని.. ఒక్క ఫోన్‌కాల్‌తో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ 88898 08182 శనివారం ప్రారంభించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందించి ప్రమాద సమయాల్లో వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు పై నంబర్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్‌లో పంపితే మరింత వేగంగా స్పందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోలీస్ కంట్రోల్‌రూమ్‌లో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వెంటనే స్పందించి సంబంధిత పోలీస్‌స్టేషన్, పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందిస్తారని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. సమాచారం అందించి ప్రాణాలు కాపాడటంలో సహకరించిన వారికి జిల్లా పోలీస్‌శాఖ తరఫున ప్రోత్సాహక బహుమతి, ప్రశంసాపత్రం అందించనున్నట్లు వివరించారు.


