పేట పురపాలికపై గులాబీజెండా ఎగరాలి
● బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట: స్థానిక పురపాలికలోని 24 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గులాబీజెండా ఎగరేస్తే వెంటనే తరలించిన చిన్నపిల్లల ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిని తిరిగి తీసుకొస్తానని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలో తొలగించిన చిన్నపిల్లల ఆస్పత్రి ఎదుట పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల నారాయణపేట జిల్లాను తొలగిస్తారనే వార్తాలు వస్తున్నాయని, జిల్లా వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని సూచించారు. అన్ని వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే తాను ముందుండి పోరాడి జిల్లాను పోనివ్వకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు 2020లో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు లేని మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రికి తరలించారని ఆరోపించారు. ఆస్పత్రి తరలింపుతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి చిన్నపిల్లలు, ప్రసూతి ఆస్పత్రిని తిరిగి పట్టణంలో ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని గుర్తుచేశారు. జిల్లాను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని.. ఇదే జరిగితే నారాయణపేట అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ బూటకపు హామీలను ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నారని.. పుర ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


