సీపీఆర్ చేద్దాం.. జీవం పొద్దాం
తక్షణం స్పందిస్తే ప్రాణం నిలబెట్టినట్లే
● జిల్లాలో పూర్తి అయిన వారోత్సవాలు
● ముమ్మరంగా అవగాహన సదస్సులు
నారాయణపేట రూరల్: వయస్సుతో సంబంధం లేకుండా ఏటా గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ సీపీఆర్ (కార్డియో పల్మొనరి రిససిటేషన్) పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా సీపీఆర్ వారోత్సవాలను నిర్వహించి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అవగాహన సదస్సులను నిర్వహించింది.
ప్రయోజనాలు ఎన్నో..
వివిధ కారణాలతో గుండె ఆగిపోయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, వైద్య సదుపాయం అందేలోపు సీపీఆర్ చేయడం ఎంతో అవసరం. తద్వారా మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ కలిగిన రక్తం తాత్కాలికంగా సరఫరా అవుతుంది. దీనివల్ల మెదడు దెబ్బతినకుండా ఉంటుంది. తక్షణమే సీపీఆర్ చేయడం వల్ల బాధితులను ప్రాణహాని నుంచి కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తికి అన్ని అవయవాలకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఆక్సిజన్ అందకపోతే మెదడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ తట్టుకోదు. ఈ లోపల సీపీఆర్ చేపడితే గుండె కొట్టుకునేలా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందించేందుకు మెదడు రక్తప్రసరణ ప్రక్రియను చేపడుతుంది. ఈ ప్రక్రియకు మొదటి నాలుగు నిమిషాలు ఎంతో కీలకం అవుతుంది. కొద్దిపాటి అవగాహన ఉంటే ఈ ప్రక్రియను ఎవరైనా చేయడానికి వీలు కలుగుతుంది.


